సుఖీభవ మూవీస్ అధినేత ఎత్తరి గురురాజ్. మలయాళంలో సూపర్‌డూపర్ హిట్ అయిన 'ఆనందం' చిత్రాన్ని అదే పేరుతో ఆయన తెలుగు ప్రేక్షకులకు ఈ నెల 23న అందించనున్నారు. మలయాళ ప్రేక్షకుల హ దయాలను కొల్లగొట్టిన ఈ చిత్రానికి గణేశ్ రాజ్ దర్శకత్వం వహించారు. కేరళ టాప్ హీరో 'ప్రేమమ్' ఫేమ్ నివిన్ పాల్ ఇందులో గెస్ట్ రోల్ చేశారు. మిగిలిన నటీనటులందరూ దాదాపుగా కొత్తవారే. తెలుగులో అనువాదమవుతోన్న 'ఆనందం' చిత్రానికి వీరా వెంకటేశ్వర రావు (పెదబాబు ),వి.ఆర్.బి.రాజు ,రవి వర్మ చిలువూరి సహ నిర్మాతలు . సీనియర్ నిర్మాత ఆర్. సీతారామరాజు ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. సచిన్ వారియర్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమాన్ని శనివారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఎత్తరి గురురాజ్ మాట్లాడుతూ ''మా 'ఆనందం' సినిమా అద్భుతంగా ఆకట్టుకుంటుందనడంలో సందేహం లేదు. సినిమా చూడటానికి ప్రేక్షకులు ఎంత ఆనందంగా థియేటర్‌కి వస్తారో.. అంతే ఆనందంగా బయటకు వస్తారు. ముఖ్యంగా సెకండాఫ్‌లో ప్రేక్షకులను ఈ సినిమా ఓ ఇమేజినేషన్‌లోకి తీసుకెళుతుంది. కేవలం యువత మాత్రమే కాదు.. ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా సినిమాను ఎంజాయ్ చేసేలా దర్శకుడు గణేష్ రాజ్ సినిమాను తెరకెక్కించారు. సినిమా చూసే వారికి వారి కాలేజీ రోజులు గుర్తుకు వస్తాయి. నాతో పాటు ఈ సినిమాను మా పిల్లలు చూశారు. వారు సినిమా చాలా బావుంది. తెలుగులో మీరే విడుదల చేయండి అని నన్ను కోరడంతో తెలుగు హక్కులను నేనే సొంతం చేసుకున్నాను. మలయాళంలో స్టార్ నటుడు నివిన్ పౌళీ ఇందులో గెస్ట్ రోల్‌లో నటించారు. తక్కువ బడ్జెట్‌లో రూపొందిన ఈ సినిమా మలయాళంలో ఇరవై కోట్ల రూపాయలను వసూలు చేసింది. తెలుగు ప్రేక్షకులకు కూడా సినిమా తప్పకుండా నచ్చుతుందని భావిస్తున్నాం'' అన్నారు.
కె.ఎల్.దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ - ''సీతారామరాజుగారితో ఎప్పటి నుండో పరిచయం ఉంది. ఆయన సమర్పణలో సినిమా వస్తుందంటే.. సినిమా తప్పకుండా బావుంటుందనే అనుకుంటున్నాం. రీసెంట్‌గా 'ఆనందం' సినిమా చూశాను. చాలా బాగా నచ్చింది. సినిమాలో మంచి ఎమోషన్స్ ఉన్నాయి. సినిమా అందరికీ మంచి పేరు తెస్తుందని భావిస్తున్నాను'' అన్నారు.
దర్శకుడు గణేష్ రాజ్ మాట్లాడుతూ - ''2010 నుండి ఈ కథను రాసుకుంటూ వచ్చాను. 2016లో మలయాళంలో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. కాలేజ్‌లో ట్రిప్‌కు వెళ్లిన కొంత మంది విద్యార్థుల కథే ఈ సినిమా. యూనివర్సల్ పాయింట్‌తో తెరకెక్కిన ఈ సినిమా తప్పకుండా తెలుగు ఆడియెన్స్‌కు కూడా నచ్చుతుందని భావిస్తున్నాను. తెలుగులో విడుదలైన హ్యాపీడేస్ సినిమా నాకు ఎంతో ఇన్‌స్పిరేషన్‌గా నిలిచింది'' అన్నారు.
హీరో తరుణ్ మాట్లాడుతూ - ''నేను 'ఆనందం' ట్రైలర్ చూశాక.. బాగా నచ్చింది. మనం అందరం కూడా చదువకునే రోజుల్లో ట్రిప్స్‌కు వెళ్లే ఉంటాం. అలా ఓ ట్రిప్‌కు వెళ్లిన కాలేజీ యువతీయువకుల కథే ఇది. అన్ని వర్గాల ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది. మలయాళంలో ఘన విజయం సాధించిన ఈ చిత్రం తెలుగులో కూడా మంచి విజయాన్ని సాధిస్తుంది'' అన్నారు.
ఈ కార్యక్రమంలో పద్మరాజు, ఎ.వి.ఎస్.రాజు, సీతారామరాజు తదితరులు పాల్గొన్నారు.