26 August 2017
Hyderabad
ప్రియాంకా నాయుడు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం అనగనగా ఒక దుర్గ. ప్రకాష్ పులిజాల ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. గడ్డంపల్లి రవీందర్ రెడ్డి సమర్పణలో రాంబాబు నాయక్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న అనగనగా ఒక దుర్గ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. సమాజంలో మహిళలపై చూపుతున్న అసమానతలను ప్రశ్నించనుందీ సినిమా. అమ్మాయిలపై జరుగుతున్న మానసిక, భౌతిక దాడులను ఎదిరించిన ఓ యువతి కథే అనగనగా ఒక దుర్గ. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు చిత్ర ప్రీమియర్ షో లకు హాజరవుతున్నారు. రామానాయుడు స్టూడియోలో జరిగిన చిత్ర ప్రదర్శనకు తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర నాయక్, దర్శకుడు ఎన్ శంకర్, చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు ప్రకాష్ పులిజాల మాట్లాడుతూ....ప్రతిఘటన, ఒసేయ్ రాములమ్మ చిత్రాల స్ఫూర్తితో అనగనగా ఒక దుర్గ చిత్రాన్ని రూపొందించాను. ఎంత అభివృద్ధి జరుగుతున్నా..సమాజంలో స్త్రీల పట్ల అసమానతలు తొలగడం లేదు. ఆడ పిల్ల పుడితే అమ్ముకునే పరిస్థితులు ఇంకా చూస్తున్నాం. అసలు తప్పు ఎక్కడ జరుగుతోందనే విషయాన్ని ఈ చిత్రంలో ప్రశ్నిస్తున్నాం. మహిళలపై జరిగే దాడులను ఎదిరించే శక్తిలా దుర్గ పాత్ర ఉంటుంది. సినిమాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలో సినిమాను విడుదల చేస్తాం. అన్నారు.
నిర్మాత రాంబాబు నాయక్ మాట్లాడుతూ...చిన్నప్పటి నుంచీ కళలంటే నాకు ఆసక్తి. సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవాడిని. జాతీయ స్థాయిలో పలు ఛారిటీ కార్యక్రమాలు నిర్వహించాం. ఈ క్రమంలోనే సామాజిక సమస్యలపై సినిమాలను నిర్మించాలనే ఆలోచన కలిగింది. ఆడపిల్లలను రక్షించుకోవాలనే సందేశాన్నిస్తూ అనగనగా ఒక దుర్గ చిత్రాన్ని నిర్మించాను. ఆడ పిల్లలను అమ్ముకోవడం ప్రత్యక్షంగా చూశాను. ఈ పరిస్థితి మారాలనేది మా ప్రయత్నం. ఎన్ని కార్యక్రమాలు ఉన్నా మా సినిమా చూసేందుకు వచ్చిన మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. అన్నారు.
దర్శకుడు ఎన్ శంకర్ మాట్లాడుతూ...సామాజిక చైతన్యమున్న చిత్రాలు చేయడం గొప్ప విషయం. మహిళా శక్తిని చూపించేలా ఈ చిత్రం ఉంటుంది. అనగనగా ఒక దుర్గ స్ఫూర్తితో మరిన్ని ఇలాంటి సినిమాలు రావాలని కోరుకుంటున్నాను. అన్నారు.
మంత్రి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ...సామాజిక సమస్యలతో సినిమాలు చేయడం సాసహమే. ఎందుకంటే సినిమాను వినోదం కోసమే చూస్తారు. ఆ కథలో సందేశాన్ని చెప్పడం గొప్ప ప్రయత్నం. సమాజాన్ని చైతన్య పరిచే అనగనగా ఒక దుర్గ లాంటి చిత్రాన్ని నిర్మించిన రాంబాబు నాయక్ ను అభినందిస్తున్నాను. సినిమా చూశాను చాలా బాగుంది. నన్ను ఆకట్టుకుంది. రేపు ప్రేక్షకులను కూడా ఆలోచింపజేస్తుందని నమ్ముతున్నాను. ప్రభుత్వాలు మహిళా రక్షణకు తగినన్ని చర్యలు తీసుకుంటున్నాయి. సృజనాత్మక రంగమైన సినిమా పరిశ్రమ నుంచి కొందరు దర్శకులు ముందుకొచ్చి ఇలాంటి సినిమాలు చేయడం స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. అన్నారు.
ఈ చిత్రానికి సంగీతం - విజయ్ బాలాజీ, సినిమాటోగ్రఫీ - కళ్యాణ్ షమీ, ఎడిటింగ్ - శివ వై ప్రసాద్, పాటలు - శ్రీరామ్ తపస్వి, పోలూరి, కొరియోగ్రఫీ - కిరణ్, రచన - దర్శకత్వం - ప్రకాష్ పులిజాల.