11 December 2017
Hyderabad
స్నేహచిత్ర పిక్చర్స్ పతాకంపై ఆర్.నారాయణమూర్తి రూపొందిస్తున్న చిత్రం `అన్నదాత సుఖీభవ`. ఈ సినిమా పాత్రికేయుల సమావేశం సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ ``అన్నదాత సుఖీభవ సినిమా రైతు సమస్యలపై తీస్తున్న సినిమా ఇది. ఒకప్పుడు అందరూర అన్నదాతను సుఖీభవ అని దీవించేవారు. కానీ నేడు ఆ అన్నదాత బ్రతుకు దుర్భరంగా మారి, దుఃఖీభవగా మారింది. అలాంటి రైతు సమస్యలను తెరపై ఈ అన్నదాత సుఖీభవ సినిమాతో చూపిస్తున్నాం. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. మా బ్యానర్‌పై రూపొందుతోన్న 30వ సినిమా ఇది. దేశానికి తిండు పెడతున్న రైతు సంక్షేమాన్ని పట్టించుకునేవాడే లేదు. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లవుతున్న రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదు. రైతుల ఆత్మహత్యలను ఆపేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. పార్లమెంటులో రైతులపై చర్చ జరగాలి. రైతు పండించే పంటలకు గిట్టుబాటు ధరలను ప్రభుత్వమే కల్పించాలనే స్వామినాథన్ కమిటీ సిపారసులను అమలు చేయాలి. రైతు రుణాలను మాఫీ చేయడం లేదు..దీంతో రైతులు అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతు సమస్యలను పరిష్కారాన్ని మా చిత్రంలో చూపించాం. ఖమ్మం, వరంగల్, ఉభయగోదావరి, ఢిల్లీలలో సినిమాను చిత్రీకరించాం. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను ఫిబ్రవరిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. నాకు ఎవరూ పోటీ లేదు. నాకు నేనే పోటీ`` అని తెలిపారు.