సెన్సార్ రివైజింగ్ కమిటీ `అన్నదాత సుఖీభవ` అని ప్రకటించింది. అన్నదాతల కష్టసుఖాల గురించి ఆర్. నారాయణమూర్తి తెరకెక్కించిన చిత్రం `అన్నదాత సుఖీభవ`. ఈ సినిమాకు హైదరాబాద్‌లో సెన్సార్ చిక్కులు ఏర్పడ్డాయి. కీలకమైన సన్నివేశాలను తీసేయమని వారు చెప్పడంతో విముఖత వ్యక్తం చేసిన ఆర్.నారాయణమూర్తి తన చిత్రాన్ని రివైజింగ్ కమిటీకి తీసుకెళ్లారు. అది ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని తెలిసినా వెళ్తున్నట్టు ప్రెస్‌మీట్ పెట్టి చెప్పారు. ఆయన నమ్మకం నిజమైంది. రివైజింగ్ కమిటీ అన్నదాతకు సెన్సార్ క్లియర్ చేసింది. దీని గురించి ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు.
ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ ``మా స్నేహ చిత్ర పతాకంపై స్వీయ దర్శకత్వంలో నేనే నటించి రూపొందించిన చిత్రం `అన్నదాత సుఖీభవ`. మా చిత్రానికి రివైజింగ్ కమిటీ క్లీన్ యు సర్టిఫికెట్ ఇచ్చింది. జూన్ 1న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాను. పొద్దు పొడవక ముందే నాగలి భుజాన వేసుకుని పొలాన్ని సాగు చేసి అన్నం పెట్టే రైతు పరిస్థితి ఇవాళ చాలా దారుణంగా ఉంది. ఎక్కడ చూసినా రైతుల ఆత్మహత్యలు మనసుల్ని పిండేస్తున్నాయి. అన్నదాతా సుఖీభవ అని అంటాం. కానీ నేడు అన్నదాత పరిస్థితి దుఃఖీభవ అన్నట్టే ఉంది. పాలకులకు ప్రజలంటే భయం ఉండాలి. అప్పుడే వ్యవస్థ బావుంటుంది. నా సినిమా సెన్సార్‌కు చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నాను. ఆ ఇబ్బందులను దాటడానికి నాకు రైతు సంక్షేమ సంఘాలు, వామపక్షాలు సహకరించాయి. వారి మద్దతుతో ఆర్సీని క్లియర్ చేసుకోగలిగాను. ఈ నెల 14న పాటల్ని విడుదల చేస్తాను. జూన్ 1న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాను`` అని అన్నారు.