జర్నీ, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, డిక్టేటర్ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన హీరోయిన్ అంజలి. తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకుంది. ఇప్పుడు ఆమె సోదరి ఆరాధ్య హీరోయిన్‌గా తెరంగేట్రం చేస్తోంది. తమిళ్‌లో రెండు సినిమాలు, తెలుగులో ఒక సినిమా చేస్తున్న ఆరాధ్య తన కెరీర్ ప్లానింగ్ గురించి తెలిపేందుకు శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసారు. ఆరాధ్య తల్లి భారతీదేవి, ఆరాధ్య ఈ ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు.
భారతీదేవి మాట్లాడుతూ ''అంజలిని హీరోయిన్‌గా నేనే పరిచయం చేశాను. తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రేక్షకులు అంజలిని బాగా ఆదరించారు. ఇప్పుడు ఆరాధ్య హీరోయిన్‌గా మీ ముందుకు వస్తోంది. డాన్స్‌కి సంబంధించిన ట్రైనింగ్, నటనలో మెళకువలు అన్నీ నేర్చుకుంది. ఆరాధ్య కూడా హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకుంటుందన్న నమ్మకం నాకు వుంది. ప్రేక్షకులు ఆరాధ్యను కూడా హీరోయిన్‌గా ఆదరిస్తారని ఆశిస్తున్నాను'' అన్నారు.
ఆరాధ్య మాట్లాడుతూ - ''చిన్నతనం నుంచి హీరోయిన్ అవ్వాలని కలలు కలే దాన్ని. అది ఈరోజు నిజమైనందుకు చాలా ఆనందంగా వుంది. నేను హీరోయిన్ అవ్వడానికి మమ్మీ సపోర్ట్ ఎంతో వుంది. అక్కను చూసి నేను చాలా నేర్చుకున్నాను. హీరోయిన్‌గా ఈ స్టేజ్‌కి రావడానికి అక్క ఎంతో కష్టపడింది. అది నేను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని ఈ ఫీల్డ్‌కి వచ్చాను. ప్రస్తుతం తమిళ్‌లో రెండు సినిమాలు చేస్తున్నాను. తెలుగులో సముద్రగారి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాను. ఇవి త్వరలోనే విడుదలవుతాయి. నటనకు ప్రాధాన్యం వున్న ఎలాంటి క్యారెక్టర్ అయినా చేయడానికి నేను సిద్ధంగా వున్నాను. నేను ఎక్స్‌పోజింగ్‌కి వ్యతిరేకిని కాదు. సబ్జెక్ట్ డిమాండ్ చేస్తే గ్లామరస్ రోల్స్ చేస్తాను. నటనలో నాకు ఇన్‌స్పిరేషన్ జయసుధగారు. ఆమె నటన అంటే నాకు చాలా ఇష్టం. అలాగే హీరోయిన్స్‌లో మా అక్క అంటే ఎంతో ఇష్టం. హీరోల్లో ప్రభాస్‌ని ఇష్టపడతాను. ఇది బాహుబలి చూసి చెప్తున్న మాట కాదు. ఈశ్వర్ చూసి నేను ప్రభాస్ ఫ్యాన్ అయ్యాను`` అన్నారు.