ఈ మధ్య మీ సినిమాలు మూస థోరణిలో వుంటున్నాయి. కొంచెం కొత్తగా ప్రయత్నించండి అని చాలా మంది చాలా రోజులుగా అడుగుతున్నారు. కొత్తగా ఏం చేయాలి? ఎలా చేయాలి? అని నేనూ ఆలోచిస్తూనే వున్నాను. అలా ఆలోచించి కొత్తగా నేను చేసిన ప్రయత్నమే మేడమీద అబ్బాయి అన్నారు అల్లరి నరేష్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం మేడమీద అబ్బాయి. ప్రజిత్ దర్శకత్వం వహించారు. నిఖిలా విమల్ కథానాయిక. జాహ్నవి ఫిల్మ్స్ పతాకంపై బొప్పన చెంద్రశేఖర్ నిర్మిస్తున్న ఈ చిత్ర ట్రైలర్‌ను శనివారం హైదరాబాద్‌లో హీరో అల్లరి నరేష్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మీలో మరో నటుడున్నారు. ఆ నటుడిని బయటికి తీసుకురావాలి. మీలో వున్న ఆ నటన అంటే నాకు చాలా ఇష్టం. నేను, గమ్యం చిత్రాల తరహాలో సీరియస్ సినిమా చేద్దాం అని కెవ్వుకేక సమయంలో నిర్మాత బొప్పన చంద్రశేఖర్ అన్నారు. అయితే నిర్మాతగా ఆయనకు తొలి సినిమా కావడంతో ఆ సమయంలో అలాంటి సినిమా కరెక్ట్‌కాదని నేనే ఆయనను నిరుత్సాహపరిచాను. ఆ తరువాత నుంచి ఎప్పుడు కలిసినా మీ పంథాను మార్చండి. మిమ్మల్ని ప్రేక్షకులు కామెడీ పాత్రల్లోనే కాదు సీరియస్ పాత్రల్లోనూ చూడటానికి ఇష్టపడుతున్నారు అని చెబుతుండేవారు. గమ్యంలో గాలిశీను నవ్విస్తూనే ఏడిపిస్తాడు. అలాంటి కథ కోసం చాలా కాలంగా వెతికాను. దాదాపు మూడేళ్ల క్రితం అలాంటి కథ దొరికింది. అదే ఒరు వడక్కన్ సెల్ఫీ. నిర్మాత ఈ సినిమా గురించి తెలిసి నన్ను చూడమన్నారు. కామెడీకి థ్రిల్లర్ అంశాల్ని మేళవించి చేశారు. అది నాకు బాగా నచ్చిడంతో రీమేక్ రీమేక్ చేశాం. మలయాళంలో ఈ చిత్రాన్ని నివీన్‌పాల్ చేశాడు. అతని బాడీలాంగ్యేజ్‌ని అనుసరించకుండా నా పంథాలో చేసిన చిత్రమిది. ఫీల్ మిస్సవకూడదనే ఉద్దేశ్యంతో మాతృకను తెరకెక్కించిన దర్శకుడినే ఈ చిత్రానికి తీసుకున్నాం. మంచి సినిమా చేశానని మనస్ఫూర్తిగా చెబుతున్నాను. సెప్టెంబర్ 8న విడుదల కానుంది. సినిమాపై చాలా నమ్మకంతో వున్నాను. ఈ సినిమాతో నా కంటే హైపర్ ఆదికే ఎక్కువ పేరొస్తుంది అన్నారు.
నిర్మాత బొప్పన చంద్రశేఖర్ మాట్లాడుతూ అల్లరి నరేష్ నటించిన అల్లరి, ప్రాణం, గమ్యం, శంభో శివ శంభో..ఈ నాలుగు చిత్రాలు కలిస్తే ఎలా వుంటుందో మా మేడమీద అబ్బాయి చిత్రం ఆ స్థాయిలో వుంటుంది అన్నారు.
హైపర్ ఆది మాట్లాడుతూ... ఎక్కడ కామెడీ కావాలో అక్కడ కామెడీ వుంటుంది. ఎక్కడ థ్రిల్లింగ్ ఎలిమెంట్ కావాలో అక్కడ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ వున్న సినిమా ఇది. అల్లరి నరేష్ కెరీర్‌లోనే బెస్ట్ సినిమాగా నిలుస్తుంది అన్నారు.
ఈ కార్యక్రమంలో గేయరచయిత విజయ్‌కుమార్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత ఎం.ఎస్.కుమార్, సీతారామరాజు పాల్గొన్నారు. అవసరాల శ్రీనివాస్, జయప్రకాష్, తులసి, సుధ, సత్యం రాజేష్, మధునందన్, జబర్దస్త్ ఆది, పద్మ జయంతి, రవిప్రకాష్, వెన్నెల రామారావు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఉన్ని ఎస్. కుమార్, సంగీతం: షాన్ రెహమాన్, ఆర్ట్: రాజీవ్ నాయర్, ఎడిటర్: నందమూరి హరి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎం.ఎస్.కుమార్, సమర్పణ: శ్రీమతి నీలిమ, నిర్మాత: బొప్పన చంద్రశేఖర్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జి.ప్రజిత్.