అల్లు అర్జున్ హీరోగా నటించిన చిత్రం `నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా`. ఈ సినిమా ఇటీవల విడుదలైంది. వక్కంతం వంశీ దర్శకత్వం వహించారు. ఈ సినిమా నిర్మాత లగడపాటి శ్రీధర్ హైదరాబాద్‌లో శనివారం మాట్లాడారు.
లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ ``నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా నిన్న విడుదలైంది. అఖండ విజయం సాధిస్తోంది. ఇది సాధారణ చిత్రం కాదు. నేను కథ విన్నప్పుడు, ప్రొడక్షన్ చూసుకున్నప్పుడు హిట్ మూవీ అనే నమ్మకంతోనే చేశా. నా కన్నా ముందు ప్రేక్షకులు సినిమా చూడాలనుకున్నా. అభిమానులు చాలా గొప్పగా చెబుతుంటే వెళ్లి చూశా. అన్‌బిలీవబుల్ సక్సెస్ అండీ. ఇలాంటి మంచి కథను అల్లు అర్జున్ ఐడెంటిఫై చేశారు. అన్ ఇమాజినబుల్ సినిమా ఇది. రోజూ 5 సినిమాలు చూసి నిద్రపోయే నేను ఈ సినిమాను చూసి చాలా స్ఫూర్తి పొందా. ఇందులో వినోదం కూడా చాలా బావుంది. ట్రైలర్, పోస్టర్‌తో ఇంపాక్ట్ ఇచ్చాం. ఫైనల్‌గా సినిమాతో చాలా మంచి ఇంపాక్ట్ ఇచ్చాం. మలయాళం, తమిళ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. తమిళంలో తొలిసారి బన్నీ సినిమా డబ్ అయింది. మలయాళంలో ఉన్నదే 400 థియేటర్లయితే 100కి పైగా థియేటర్లలో సినిమా వేశారు. తమిళనాడులో ఇంత మంచి సినిమాలు ఎందుకు చేయరని అక్కడి ప్రెస్ వాళ్లే మమ్మల్ని అడిగారు. అంత బాగా నచ్చింది వాళ్లకి సినిమా. మామూలుగా యుగానికి ఒక మంచి కథ వస్తుంది. రామాయణం, భారతం అలా వచ్చినవే. ఇప్పుడు కలి యుగంలో దశాబ్దానికి ఓ మంచి కథ వస్తోంది. ఆ కథే ఇది. ప్రేక్షకులకు మరపురాని ఇంపాక్ట్ ఇచ్చిన చిత్రం ఇది. ప్రేక్షకుల్లో మార్పు తెచ్చే సినిమా ఇది. రామాయణం, మహాభారతం లాగా ఈ సినిమాలో మల్టీపుల్ కాంప్లెక్స్ లను ఇందులో చూపించారు. ఇల్లు శుభ్రం చేసుకుంటే ఎంత శుభ్రంగా ఉంటుందో, స్నానం చేసుకుంటే ఎంత శుభ్రంగా ఉంటుందో అలా ఇలాంటి సినిమా చూసినప్పుడు మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. రిఫ్రెష్ అవుతుంది. అలాంటి సినిమానే ఇది. ఈ సినిమా ఓకే కావడానికి సహకరించిన వాళ్లందరికీ ధన్యవాదాలు. రోజులు గడిచే కొద్దీ క్లాసిక్‌గా నిలిచిపోతుంది. రామాయణం, మహాభారతం కూడా సరిగా కనెక్ట్ కాని ఈ సమాజానికి ఈ సినిమా తప్పక కనెక్ట్ అవుతుంది. పెట్టిన డబ్బుకు పదింతలు వేల్యూ ఉన్న సినిమా ఇది. అర్జున్, శరత్‌కుమార్ నటన ఆసమ్. వారి ప్రతి మాటా ఆణిముత్యంలా ఉంటుంది. మన వాళ్లని ప్రపంచవ్యాప్తంగా గుర్తిస్తున్నారు. ఇండియన్స్ అందరూ గర్వపడే చిత్రం మా సినిమా. ఇండియా అంటే గుండెల్లో ఉన్న భక్తి, శక్తి అని చెప్పిన డైలాగులు మెప్పిస్తున్నాయి. అల్లు అర్జున్‌గారి యాక్టింగ్‌కి తిరుగులేదు. ఆయన నటన చూసి మా వాళ్లు చాలా మంది అమీర్‌ఖాన్‌ని గుర్తు చేసుకున్నారు అని చెప్పడం ఆనందంగా ఉంది. ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ చాలా కీలకం. దేశభక్తి అనేది ఇందులో ఓ కీలక విషయం. ఈ సినిమా చూసి చాలా మంది సైనికులకు సాయం చేయడానికి, వాళ్ల ఫ్యామిలీలకు అండగా నిలబడటానికి ముందుకొస్తారు. పాండవుల కథను ఎంత ఇష్టపడతామో, ఈ కథను అంతగానే ఇష్టపడతాం. ఇది ఒక పేజీ కాదు. ఇది ఒక పుస్తకం. జీవితాన్ని తీర్చిదిద్దే పుస్తకం ఇది. ఇవాళ పుస్తకాలను చదవడం మానేశారు. అలాంటి తరుణంలో ఇంత మంచి విషయాన్ని పూసగుచ్చినట్టు ఈ సినిమాలో చెప్పారు వక్కంతం వంశీ. దేశభక్తి రోల్‌లో సాయికుమార్, తల్లిగా నదియ, చారుహాసన్‌గారు, విక్రమ్ సహిదేవ్ అందరూ చాలా బాగా చేశారు. మా `నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా` యాక్షన్ క్లాసిక్. పోరాటానికి అర్థం పర్థం ఉన్నట్టు ఉండే యాక్షన్ చిత్రమిది. సక్సెస్ టూర్ సోమవారం నుంచి మొదలుపెడతాం. నాగబాబు, బన్నీవాసుకు శుభాకాంక్షలు. డైరక్షన్, టెక్నికల్ టీమ్‌కి ధన్యవాదాలు.మొదటిరోజు రూ.45కోట్ల గ్రాస్‌ని కలెక్ట్ చేసింది. తెలుగు, తమిళ్, మలయాళంలో విడుదల చేశాం. ఏ రేంజ్ కలెక్షన్లు వస్తాయనేది తెలియదు. `బాహుబలి` వాళ్లు వేసిన పాత్‌లో మేం నడుస్తున్నాం. హిందీకి డబ్బింగ్ పనులు పూర్తయ్యాయి. త్వరలో అక్కడ కూడా విడుదల చేస్తాం. లవర్ ఆల్సో, ఫైటర్ ఆల్సో సినిమా చేస్తున్నప్పుడు జిమ్ అని ఓ నిర్మాతలను కలిశాను. ఆయనకు అల్లు అర్జున్ గురించి చెప్పగానే 5 నిమిషాలు వీడియో అడిగారు. పంపాను. వాళ్లు స్పానిష్‌లోనూ, ఇంకా పలు ఇంటర్నేషనల్‌లోనూ విడుదల చేస్తాం `` అని చెప్పారు.