సురేష్ ప్రొడక్షన్స్, బ్లూ ప్లానెట్ ఎంటర్‌టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘నేనే రాజు నేనే మంత్రి’. డా.డి.రామానాయుడు సమర్పిస్తున్నారు. తేజ దర్శకత్వం వహిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నారు. డి. సురేష్‌బాబు, ఎం.వి.కిరణ్ రెడ్డి, సి. భరత్ చౌదరి నిర్మాతలు. వివేక్ కూచిభొట్ల, అభిరామ్ దగ్గుబాటి ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు. కాజల్ అగర్వాల్, కేథరిన్ ట్రెసా నాయికలు. నవదీప్ కీలక పాత్రధారి. ఈ నెల 11న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో..
డి.సురేష్‌బాబు మాట్లాడుతూ - ``నేనే రాజు నేనే మంత్రి కథను ముందు వినగానే రానాకు ఈ కథ సూట్ అవుతుందనిపించింది. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ, బ్లూ ప్లానెట్ సంస్థతో కలిసి `నేనే రాజు నేనే మంత్రి` సినిమా చేశాం. బ్లూ పానెట్ నుండి భరత్‌చౌదరి, కిరణ్ రెడ్డిలు ఇండస్ట్రీలోకి నిర్మాతలుగా అడుగుపెడుతున్నారు. సాధారణంగా ఇండస్ట్రీలోకి రావచ్చా, ఎలాంటి సమస్యలు ఉంటాయని ఈ మధ్యనే ఎవరో అడిగారు. ఎవరైనా అలా అడిగినా వారి ఆసక్తిని బట్టి సినిమాల్లోకి రమ్మని అంటాం. రావద్దని చెప్పినా, రాకుండా ఉండలేరు. వచ్చినవాళ్లలో కొంత మంది ఇండస్ట్రీలో నిలబడితే, కొంతమంది పొగొట్టుకుంటారు. సినిమాల్లోకి రావాలని చాలా మంది కలలు కంటుంటారు. కానీ ఆ కలను కొంతమందే నేరవేర్చుకుంటారు. సినిమాలు తీసి విడుదల చేస్తే హ్యాపీగా అనిపిస్తుంది. చాలా మందికి వీడికేం ఇండస్ట్రీలోకి వచ్చేశాడు. అన్ని సుఖాలే అనుకుంటారు. కానీ అనుకున్నంత సుఖంగా ఎవరూ ఉండలేరు. ఇక రానాను హీరోగా చేయాలనిపించగానే తనతో ఎలాంటి సినిమా చేయాలని చాలా ఆలోచించాను. తనతో ఖైదీ వంటి సినిమా చేయాలని కోరిక ఉండేది. ఆ సమయంలో శేఖర్ కమ్ముల వచ్చి `లీడర్` కథ చెప్పాడు. వెంకటేష్‌తో సినిమా చేయమని అంటే, శేఖర్ మాత్రం సినిమాను రానాతోనే సినిమా చేస్తానని అన్నాడు. రానా తొలి సినిమాను వేరే సంస్థతో చేస్తున్నప్పుడు తండ్రిగా నేను టెన్షన్‌గానే ఫీలయ్యాను. హీరో అయిన తర్వాత తను చేసిన కొన్ని సినిమాలు మంచి సక్సెస్‌ను సాధించాయి. కొన్ని సరిగా ఆడలేదు. నేను మాత్రం తనకు సూపర్ హీరో కథనో, సూపర్ విలన్ కథనో ఇవ్వాలని నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను. రానా కృష్ణం వందే జగద్గురమ్ సినిమా చేసిన తర్వాత రాజమౌళి తనకు బాహుబలిలో అవకాశం ఇవ్వడం, బాహుబలికి ఎంతో పేరు రావడం, తర్వాత రానా చేసిన ఘాజీ పెద్ద హిట్ కావడం జరిగాయి. ఆ సమయంలో తేజ `అహం` అనే కథతో నన్ను కలిశాడు. కథ చెప్పి రానా విలన్‌గా చేయాలని అన్నాడు. రానా కథ విని సూపర్బ్‌గా ఉందని అన్నాడు. అప్పుడు బ్లూ ప్లానెట్ వాళ్లతో కలసి సినిమా అనుకోగానే, అందరం కలిసి కథనను సిద్ధం చేశాం. ఫైనల్‌గా చూస్తే క్లాసిక్ మూవీలా తయారైంది. సినిమాలో రానా యాక్టింగ్ చూశాను. మూడు నాలుగు సన్నివేశాల్లో నన్నైతే ఏడిపించేశాడు. తన నటన పట్ల నేను సంతృప్తి చెందాను. కారైకూడి, కర్నూలు, అనంతపురం తదితర ప్రాంతాల్లో సినిమాను పూర్తి చేశాం. సినిమా కొత్తగా అనిపిస్తుది. తేజ దర్శకుడు అనగానే ఆయనకు సక్సెస్‌లు లేవు కదా, అని చాలా మంది అన్నారు. కానీ తనెంటో అందరికీ తెలుసు. టాలెంట్ ఉండి సక్సెస్‌లు లేకపోయినా, మంచి సినిమా తీస్తారనే నమ్మకంతో తనతో సినిమా చేశాం. తేజగారి వైఫ్ కూడా రీసెంట్‌గా సినిమా చూసి చాలా బాగా చేశావ్ అని మెచ్చుకున్నారు. సినిమాలో జోగేంద్ర, రాధ క్లాసిక్ భార్యభర్తలుగా నటించారు. మూడో కోణంలో మరో లేడీ కూడా ఉంటుంది. మనకు పెద్దవాళ్లు ఓ లక్ష్యాన్ని ఇస్తారు. ఆ లక్ష్య సాధనలో మనం కొన్నిసార్లు దారి తప్పుతాం. అలా తప్పుదారి పట్టిన హీరో తన తప్పును ఎలా కరెక్ట్ చేసుకున్నాడనేదే కథ. నాయగన్ వంటి కథ ఇది. సినిమా ఆగస్ట్ 11న విడుదలవుతుంది. అదే రోజున నితిన్ లై, బోయపాటి జయజానకి నాయక సినిమాలు కూడా విడుదలవుతున్నాయి. థియేటర్స్ విషయంలో కొన్ని సమస్యలున్నాయి. ఇలా ఓ మోస్తారు సినిమాలు ఓకే రోజున కావడం మంచిది కాదని నా అభిప్రాయం. అందువల్ల మిగిలి ఇద్దరితో కూడా మాట్లాడటానికి ప్రయత్నించాను. కానీ ఎవరు వెనక్కి వెళ్లడం లేదు. నిజానికి అజిత్ సినిమా ఆగస్ట్ 11న విడుదలై ఉంటే నేను ఆగస్ట్ 25న మా సినిమాను విడుదల చేసేవాణ్ణి. అందుకు కారణం రానాకు, అజిత్ అంటే మంచి అనుబంధం ఉంది. ఇక మా సినిమా బిజినెస్ విషయంలో చాలా చొరవ చూపాడు. తనకు సినిమా అంటే చాలా ప్యాషన్. అందుకనే సినిమా విషయంలో చాలా కేర్ తీసుకున్నాడు. నేను టెక్నికల్‌గా చాలా విషయాలు నేర్చుకోవాలి. నేను కూడా జీవితంలో నేర్చుకుంటున్నాను. నాకు కూడా విజువల్ ఎఫెక్ట్స్‌పై పెద్దగా నాలెడ్జ్ లేదు. ఉదాహరణ చెప్పాలంటే వెంకటేష్ హీరోగా జంతువులపై ఓ సినిమా చేయాలనుకుంటున్నాను. కానీ నాకు ఎలా చేయాలో నాలెడ్జ్ లేదు. కథ విన్నవారందరూ వారికి తోచిన విధంగా సలహాలు ఇస్తున్నారు. బిగ్ బడ్జెట్ సినిమాలంటే విజువల్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండవు. కాబట్టి ఆ నాలెడ్జ్ వస్తే, తప్పకుండా నేను పెద్ద ప్రాజెక్ట్స్ చేయడానికి సిద్ధం. ఇప్పుడు మా బ్యానర్‌లో `అదుగో` సినిమా కూడా వరాహంపై ఉంటుంది. టెక్నికల్ సినిమా. సినిమా పూర్తయిపోయి ఎనిమిది నెలలు అవుతుంది. మరో రెండు నెలలు తర్వాతే సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. కుదిరితే నేను రాజు నేనే మంత్రి సినిమా సమయంలో అదుగో సినిమా ట్రైలర్ విడుదల చేసేలా ప్లాన్ చేశాం. కుదరకపోతే, ఈ నెలలోనే ట్రైలర్‌ను విడుదల చేస్తాం`` అన్నారు.
నిర్మాత కిరణ్ రెడ్డి మాట్లాడుతూ - ``స్క్రిప్ట్ విన్న తర్వాత కచ్చితంగా మంచి సినిమా అవుతుందని భావించాను. సురేష్ ప్రొడక్షన్స్‌తో కలిసి సినిమా చేయడం సంతోషంగా ఉంది. సినిమా గురించి బొత్తిగా అవగాహన లేదు. అయినా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాను. సురేష్‌బాబుగారి దగ్గర సినిమాకు సంబంధించిన విషయాలు చాలానే నేర్చుకున్నాను. తేజగారు సినిమా స్టార్ట్ అయిన తర్వాత అహం, నేనే రాజు నేనే మంత్రి టైటిల్స్ చెప్పి ఏదైతే బావుంటుందని అడిగాడు. ముందు నేను అహం బావుందని అన్నాను. ఆయన మాత్రం బాగా ఆలోచించి చెప్పమని చెప్పారు. నాకు కూడా కథ పరంగా నేనే రాజు నేనే మంత్రి టైటిల్ అయితే సరిపోతుందనిపించి తేజగారికి చెప్పాను. అలా ఈ టైటిల్‌ను పెట్టారు. రానాగారు ఆల్‌రౌండర్‌లా పబ్లిసిటీ విషయంలో కేర్ తీసుకున్నారు. భవిష్యత్‌లో కూడా సురేష్ ప్రొడక్షన్‌తో కలిసి సినిమాలు చేస్తాం`` అన్నారు.
భరత్ చౌదరి మాట్లాడుతూ - ``మా మొదటి సినిమానే క్రేజీ ప్రాజెక్ట్‌గా చేశాం. నేను డిస్ట్రిబ్యూటర్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను. ఈ సినిమాతో నిర్మాతగా మారాను. అందుకు కారణం సురేష్‌బాబుగారే. ఈ సినిమా విషయంలో రానా ఆయన బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయే క్యారెక్టర్ చేశారు. సినిమా విడుదలకు ముందే మేం సేఫ్ జోన్‌లో ఉన్నాం. తేజగారు అద్భుతంగా తెరకెక్కించారు. రానాగారికి నెక్స్‌ట్ స్టెప్‌కు తీసుకెళ్లే సినిమా ఇది`` అన్నారు.