నితిన్, మేఘా ఆకాశ్ జంటగా నటించిన చిత్రం 'ఛల్ మోహన్ రంగ` నితిన్ నటించిన 25వ చిత్రమిది. కృష్ణ చైతన్య దర్శకుడు. పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్, శ్రేష్ఠ్ మూవీస్ సంస్థలపై ఎన్.సుధాకర్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాకి త్రివిక్రమ్ కథను అందించారు. ఏప్రిల్ 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది.
నితిన్ మాట్లాడుతూ - ''16 ఏళ్ళల్లో 25 సినిమాలు పూర్తిచేయడం ఆనందంగా ఉంది. ఇందుకు కారణమైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఒక మంచి కామెడీ లవ్ స్టోరీ అందించాలనే ఉద్దేశంతోనే ఈ సినిమా చేయడం జరిగింది. సింపుల్ స్టోరీ అయినప్పటికీ.. కామెడీ బాగా వర్కవుట్ అయ్యింది. అమెరికాలోనే కాకుండా ఇక్కడ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. థియేటర్‌లో సినిమా చూశాను. ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ బాగుంది. చాలా రోజుల తరువాత మంచి సినిమా చూశామని చెబుతున్నారు. దీనికి ముఖ్య కారణం.. మా దర్శకుడు కృష్ణచైతన్య. ఆయన రాసిన మాటలు త్రివిక్రమ్ గారి శైలిలో ఉన్నాయంటున్నారు. అతను రాసిన డైలాగ్స్ వల్ల, కామెడీ వల్ల మంచి పేరొచ్చింది. రెండున్నరగంటల పాటు వినోదాన్ని మాత్రమే కోరుకునే వారికి మా సినిమా తప్పక నచ్చుతుంది'' అని తెలిపారు.
దర్శకుడు కృష్ణ చైతన్య మాట్లాడుతూ - ''ఈ సినిమా రిలీజ్ టైమ్‌లో మా ఊరైన ఏలూరులో ఉన్నారు. అక్కడే సినిమాని చూశాను. కంప్లీట్ థియేటర్.. నవ్వులతో నిండిపోయింది. ఏ ఉద్దేశంతో తీశామో.. అది నెరవేరినట్లయ్యింది. నేను 'రౌడీ ఫెలో' తీసినప్పుడు ఓ సీరియస్ ఫిల్మ్ తీశానే ఫీలింగ్ ఉండేది. ఇప్పుడు కామెడీతో సినిమా చేయడం కొత్త ఎక్స్‌పీరియన్స్. సింపుల్ స్టోరీతో సినిమా తీయడం కష్టమైన విషయంగానే చెప్పుకోవాలి. తమన్ ఎక్స్‌ట్రార్డనరీ బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. ఆర్టిస్టులు అందరి సహకారం మరువలేనిది'' అని అన్నారు.
సీనియర్ నరేశ్ మాట్లాడుతూ - `` ఒకప్పుడు లవ్‌స్టోరీస్ ఎలా వస్తాయో అనుకున్నాను. కానీ కొత్త తరం దర్శకులు చాలా మంచి ప్రేమకథలతో సినిమాలు చేస్తున్నారు. అలా కామెడీ యాంగిల్‌లో వచ్చిన మరో ప్రేమకథా చిత్రమే ఛల్ మోహన్‌రంగ. మంచి సక్సెస్ సాధించిన ఎంటైర్ యూనిట్‌కు ఆల్ ది బెస్ట్. జయం నుండి నేను నితిన్‌ను ఫాలో అవుతున్నాను. తనతో చాలా సినిమాలకు పనిచేశాను. జయాపజయాలకు అతీతంగా స్టడీగా రాణిస్తున్నాడు. కామెడీ చేయడం కష్టం. కామెడీ చేసే ఏ హీరో అయినా.. అన్నింటిని సులభంగా చేస్తాడని మా గురువుగారు జంధ్యాలగారు చెప్పినట్లు నితిన్ ప్రూవ్ చేశాడు. కృష్ణచైతన్య కథ చెప్పినప్పుడు హెల్దీ హిట్ అవుతుందని ఆరోజునే చెప్పాను`` అన్నారు.
నర్రా శీను మాట్లాడుతూ - ``సినిమాలో నాకు చాలా మంచి క్యారక్టర్ చేశాను. ఈ క్యారెక్టర్‌ను నాకు ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్`` అన్నారు.
మేఘా ఆకాశ్ మాట్లాడుతూ - ``సినిమా నాకు చాలా స్పెషల్. దర్శక నిర్మాతలకు పవన్, త్రివిక్రమ్‌గారికి, ఎంటైర్ యూనిట్‌కు థాంక్స్`` అన్నారు.