25 November 2017
Hyderabad
`పెళ్ళిచూపులు` తర్వాత డి.సురేష్ బాబు సమర్పణలో దర్మపథ క్రియేషన్స్ పతాకంపై రూపొందిన చిత్రం ‘మెంటల్ మదిలో’. రాజ్ కందుకూరి నిర్మాత. వివేక్ ఆత్రేయ దర్శకుడు. శ్రీవిష్ణు, నివేథా పేతురాజ్ జంటగా నటించారు. ఈ సినిమా నవంబర్ 24న విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో థాంక్స్ మీట్‌ను నిర్వహించారు.
రాజ్ కందుకూరి మాట్లాడుతూ - ``ఈ సినిమా విడుదలకు సురేష్‌బాబుగారు అందించిన సహకారం మరచిపోలేనిది. ఈ నాలుగు రోజుల్లో పెళ్లిళ్ళు,శుభకార్యాలున్నాయి. అయిన ప్రేక్షకులు సినిమాను చక్కగా ఆదరిస్తున్నారు. 80 శాతం థియేటర్స్ ఫుల్ అవుతున్నాయి. ఈ సినిమాకు ఇద్దరు హీరోలున్నారు. ఒకరు శ్రీవిష్ణు అయితే మరొకరు శివాజీ రాజాగారు. అలాగే ప్రశాంత్ విహారి అద్భుతమైన సంగీతం అందించారు. తను చేసిన షార్ట్ ఫిలిం బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చూసి తనకు నేను ఈ సినిమాలో అవకాశం ఇచ్చాను. తను నా నమ్మకాన్ని నిలబెట్టాడు. అలాగే రాజ్ మాదిరాజ్, కిరిటీ, అనితాచౌదరి ఇలా అందరూ తమ వంతు పాత్రను నిర్వహించారు. అలాగే నారా రోహిత్‌గారికి హృదయ పూర్వక అభినందనలు. తన మిత్రుడు శ్రీ విష్ణు కోసం సినిమాలో గెస్ట్ రోల్ చేయడం ఆయనకు అభినందనీయం. అలాగే శ్రీవిష్ణు చాలా చక్కగా నటించాడు`` అన్నారు.
శివాజీ రాజా మాట్లాడుతూ - ``నేను నటించిన సినిమా నచ్చకపోతే, నేనే చూడను. నా మిత్రులు ఉల్లూరి పల్లి రమేష్ నాకు ఫోన్ చేసి అభినందించాడు. అలాగే రోజా రమణి గారు ఫోన్ చేసి `ఇన్నేళ్ల నా అనుభవంలోసినిమా చూసి ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌కు ఫోన్ చేయడం ఇదే తొలిసారి` అన్నారు. అంత కంటే గొప్ప అభినందన ఏముంది. కథ విన్నప్పుడు వివేక్ ఆత్రేయ గురించి ఏదో అనుకున్నాను. కానీ తను ఎంతో క్లారిటీ ఎంతో చక్కగా తెరకెక్కించాడు. తను ఇండియాలో బెస్ట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకుంటాడనంలో సందేహం లేదు. మణిరత్నం, బాపు వంటి దర్శకులు వివేక్‌లో కనపడుతున్నారు. సినిమాను ఒకసారి చూస్తే, రెండోసారి చూడాలనిపిస్తుంది`` అన్నారు.
శ్రీ విష్ణు మాట్లాడుతూ -``సినిమా ఫస్ట్ కాపీ రాగానే సురేష్‌బాబుగారు 10 రోజుల పాటు స్పెషల్ షోస్ వేయమని చెప్పేశారు. అయన కాన్ఫిడెంట్‌కు నేను థ్రిల్ అయ్యాను. ఈ పదిరోజులు ఐసియు పెషెంట్ ఎలా ఉన్నాడని ఆరా తీసేలా..ప్రతిరోజూ టెన్షన్‌గానే ఉండేది. చివరు సినిమాను ప్రేక్షకులు ఆదరించడం ఆనందంగా ఉంది. ఇది మంచి సినిమా, తెలుగు సినిమా, తెలుగు సినిమా. సినిమా చూసిన వారందరూ బావుందనిఅంటున్నారు. వివేక్ లాంటి డైరెక్టర్స్ చాలా మంది ఉన్నా, రాజ్ కందుకూరి వంటి నిర్మాత ఒకరే ఉన్నారు. ఇలాంటి సినిమాను ఆదరిస్తేనే ఎక్కువ మంది రాజ్ కందుకూరిలు ఇండస్ట్రీలోకి వస్తారు. ఆడియెన్స్‌పై నమ్మకంతో చేసిన సినిమా ఇది. శివాజీరాజాగారి టైమింగ్ బాగా నచ్చింది. ఆయనతో భవిష్యత్‌లో కూడా సినిమాలు చేయాలనుకుంటున్నాను`` అన్నారు.
దర్శకుడు వివేక్ ఆత్రేయ మాట్లాడుతూ - ``దాదాపు కొత్తవాళ్లందరం కలిసి చేసిన సినిమా ఇది. కొత్తవాళ్లు సినిమాను ఎలా చేస్తారోననే టెన్షన్ ఉంటుంది. ఆ టెన్షన్ లేకుండా నమ్మకంతో రాజ్ కందుకూరిగారు సినిమా చేశారు. మాలాంటి యువతకు ప్లాట్‌ఫామ్ ఎంతో ముఖ్యం. అలాంటి ప్లాట్‌ఫాంను రాజ్ కందుకూరిగారు మాకు ఇచ్చారు. అలాగే వయసులో చిన్నవాడినైనా..డైరెక్టర్‌ననే కారణంతో శివాజీరాజా, అనితాచౌదరి, రాజ్ మాదిరాజ్ వంటివారు ఎలా కావాలో అలా నటించారు. ఇక్కడ నుండే కాదు, యు.ఎస్ నుండి కూడా చాలా మంది ఫోన్ చేసి అభినందిస్తున్నారు. ప్రశాంత్ విహారి ఎక్సలెంట్ మ్యూజిక్ అందించారు. డేడికేషన్ ఉన్న టీం వల్లనే ఓ మంచి సినిమా చేయగలిగాం`` అన్నారు.
ఈ కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ విహారి, ఎడిటర్ విప్లవ్, అనితా చౌదరి, మధుర శ్రీధర్ తదితరులు పాల్గొని ప్రేక్షకులకు థాంక్స్ చెప్పారు.