`పెళ్ళిచూపులు` తర్వాత డి.సురేష్ బాబు సమర్పణలో దర్మపథ క్రియేషన్స్ పతాకంపై రూపొందిన చిత్రం ‘మెంటల్ మదిలో’. రాజ్ కందుకూరి నిర్మాత. వివేక్ ఆత్రేయ దర్శకుడు. శ్రీవిష్ణు, నివేథా పేతురాజ్ జంటగా నటించారు. ఈ సినిమా నవంబర్ 24న విడుదలైంది. ఈ సినిమా సక్సెస్‌మీట్‌ను గురువారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా..
రాజ్ కందుకూరి మాట్లాడుతూ - `` పెళ్ళిచూపులు` సినిమాకు ఎంత పెరొచ్చిందో ఈ సినిమాకు కూడా అంతే పెరొచ్చింది. ఈ సినిమా చూసిన వారందరూ అప్రిసియేట్ చేస్తున్నారు. ప్రతి సీన్‌ను ప్రేక్షకులు విశ్లేషించడం చూసి ఆనందమేసింది. అలాగే ఈ సినిమా ద్వారా పది మంది కొత్త టెక్నిషియన్స్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ పది మంది మరో ఇరవై సినిమాలు చేస్తారు. ఇలా చేయడం వల్ల నా బ్యానర్ నుండి వచ్చిన వారు సినిమాలు చేస్తున్నారని గొప్పగా ఫీలవుతాను. అలాంటి గొప్ప జర్నీ చేయబోతున్న వారిలో వివేక్ ఆత్రేయ ఒకడవుతాడని అనడంలో సందేహం లేదు. అలాగే కెమెరామెన్ వేద రామన్, ఎడిటర్ విప్లవ్, మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంతి విహారి కూడా ఇలాంటి జర్నీయే చేస్తారని అనుకుంటున్నాను. ఇక్కడ 200 స్క్రీన్స్‌లో, అమెరికాలో 83 స్క్రీన్స్‌లో సినిమా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుందంటే నిర్మాత డి.సురేష్‌బాబుగారే కారణం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది కొత్త వారు అవకాశాల కోసం ఎదురుచూస్తుంటారు. నేను ఏడాదికి ఒక సినిమా మాత్రం చేయగలను. మీరందరూ నాకు సపోర్ట్ చేస్తే..కొత్తవారిని ఆ సినిమాల ద్వారా పరిచయం చేయగలుగుతాను. ఈ సినిమా సక్సెస్ విషయంలో నాకు సహకరించిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు థాంక్స్`` అన్నారు.
శివాజీ రాజా మాట్లాడుతూ - ``పూర్ణోదయ మూవీస్ వారు ఏడెనిమిది సినిమాలే చేసిన జీవితాంతం గుర్తుండిపోయే సినిమాలను చేశారు. అలాగే రాజ్ కందుకూరి చేయబోయే సినిమాలు కూడా అలాగే గుర్తుండిపోతాయని చెప్పడంలో సందేహం లేదు. హీరో శ్రీవిష్ణు, డైరెక్టర్ వివేక్, సినిమాను విడుదల చేసిన డి.సురేష్‌బాబు, రాజ్‌కందుకూరి ఈ సినిమాను సక్సెస్ చేసిన హీరోలైతే సినిమాను చూస్తూ ఎంకరేజ్ చేస్తున్న ప్రేక్షకులు అసలైన హీరోలు`` అన్నారు.
ప్రవీణ సత్తారు మాట్లాడుతూ - ``ఈ సినిమా గురించి నాకు ముందు నుండి తెలుసు. ఈ సినిమా విడుదలకు ముందే పాజిటివ్ టాక్ నడిచింది. నిర్మాతకు కాన్ఫిడెంట్ ఇచ్చిన సినిమా ఇది. సాధారణంగా కొత్తవాళ్లతో చేసిన సినిమా బాధ్యతను నిర్మాతే చూసుకోవాల్సి ఉంటుంది. రాజ్‌కందుకూరిగారు ఆ విషయంలో పెద్ద సక్సెస్‌ను సాధించారు. అలాగే దర్శకుడు వివేక్ ఆత్రేయకు అభినందనలు. తనలాంటి దర్శకులు కొత్త తరహా కాన్సెప్ట్‌లతో సినిమాలు చేసినప్పుడు నాలాంటి దర్శకులకు కూడా కొత్త సెన్సిబుల్ సినిమాలు చేయడానికి ఆస్కారం ఉంటుంది. 2017 ఏడాదిని తెలుగు సినిమా ఇండస్ట్రీకి మంచి ఏడాదిగా చెప్పుకోవచ్చు. 2018 దీన్ని మించాలని, కొత్త సినిమాలు చేయడంలో మలయాళ సినిమాఇండస్ట్రీని మనం బీట్ చేయాలని కోరుకుంటున్నాం. ఇందులో నటించిన శ్రీవిష్ణు, ప్రశాంతి విహారి, వేద్ రామన్ సహా అందరికీ అభినందనలు`` అన్నారు.
కె.ఎల్.దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ - ``నిర్మాతలు సాధారణంగా చిన్న సినిమా తీసి పెద్ద హిట్ ఇచ్చిన తర్వాత మరోసారి చిన్న సినిమా తీయాలంటే ఆలోచిస్తున్నాం. కానీ రాజ్ కందుకూరి `పెళ్ళిచూపులు` వంటి చిన్న సినిమాతో పెద్ద హిట్ ఇచ్చి..మళ్లీ `మెంటల్ మదిలో` వంటి చిన్న సినిమాతో మరో సక్సెస్‌ను అందుకున్నాడు. రాజ్ కందుకూరి ఇలాంటి జర్నీని కంటిన్యూ చేస్తాడనే అనుకుంటున్నాను. ఇండస్ట్రీకి రావాలనుకునే కొత్తవారికి రాజ్ కందుకూరి వంటి నిర్మాతలెంతో అవసరం. ఎంటైర్ టీంకు కంగ్రాట్స్`` అన్నారు.
శ్రీ విష్ణు మాట్లాడుతూ - ``ఈ సినిమా చేసే సందర్భంలో ఇది మంచి సినిమా అని పేరు తెచ్చుకుంటే చాలు అని అనుకున్నాను. కానీ దీనికి మంచి సినిమా అనే పేరుతో పాటు మంచి హిట్ కూడా వచ్చింది. గౌరవం తెచ్చి పెట్టిన సినిమా ఇది. నేను చదువకునే రోజుల్లో జస్ట్ పాస్ అయ్యే స్టూడెంట్‌ని. ఆ రోజుల్లో టాపర్స్ అయిన స్టూడెంట్స్‌ను ఎవరైనా పొగుతుంటే నాకు కోపం వచ్చేసేది. నాకు వ్యక్తిగతంగా అలాంటి అనుభవం ఎదురు కాలేదు మరి. ఈ సినిమా చూసిన తర్వాత అందరూ ఫెంటాస్టిక్, వండర్‌ఫుల్ మూవీ అని చెబుతుంటే ఆనదంగా ఉంది. కొత్త సినిమా చేస్తే ఆదరణ ఎలా ఉంటుందోనని అనుకునేవాడిని. కానీ ఊహించని విధంగా ఈ సక్సెస్‌తో పూర్తిగా సంతృప్తి చెందాను. ఇలాగే డిఫరెంట్ సినిమాలు చేస్తాననే అనుకుంటున్నాను. అలాగే వివేక్‌గారు ఇలాగే డిఫరెంట్ సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. `పెళ్ళిచూపలు` తర్వాత రాజ్ కందుకూరిగారిని పెళ్ళిచూపులు నిర్మాత అన్నారు. ఆ సినిమాతో ఈ సినిమాను కంపేర్ చేశారు. అలా చేయడం వల్ల కాస్త టెన్షన్ కూడా పెరిగింది. భవిష్యత్‌లో థర్మపథ క్రియేషన్స్ అంటే ఫ్యామిలీ అంతా కలిసి సినిమాలు చూడొచ్చుననే ధైర్యం ఇచ్చిన నిర్మాత రాజ్ కందుకూరిగారికి థాంక్స్`` అన్నారు.
వివేక్ ఆత్రేయ మాట్లాడుతూ - ``సాధారణంగా మనకు ఇళయరాజాగారి పాటగానీ, ఎ.ఆర్.రెహమాన్‌గారి పాటగాని విన్నప్పుడు అరెరే..అప్పుడే అయిపోయిందా! అనే ఫీలింగ్ కలుగుతుంది. అలాంటి ఫీలింగ్ ఈ సినిమా జర్నీలో సినిమా అప్పుడే అయిపోయిందా అని నాకు అనిపించింది. ఈ జర్నీలో నాకు సపోర్ట్ చేసిన రాజ్ కందుకూరిగారికి థాంక్స్. `పెళ్ళిచూపులు` తర్వాత రాజ్‌గారిపై ఎంతో ప్రెషర్ ఉంటుందనే సంగతి నాకు తెలుసు. ఆ సమయంలో ఆయన నాతో `వివేక్..హిట్ సినిమా వద్దు, ఓ మంచి సినిమా తీద్దామని అనేవారు`. మంచి సినిమాను హిట్ చేసిన అందరికీ థాంక్స్. వెంకట సిద్ధారెడ్డి, పవన్ సాధినేవంటి వారు ఎంతో సహకారం అందించారు. అందరికీ థాంక్స్`` అన్నారు.
ఈ కార్యక్రమంలో భాస్కరభట్ల, సిరా శ్రీ, అనితా చౌదరి, కిరిటీ తదితరులు పాల్గొని తన సంతోషాన్ని వ్యక్తంచేశారు.