సాయి సెల్యులాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్ ప్రై.లి బ్యానర్‌పై సప్తగిరి, రోషిణి ప్రకాష్ హీరో హీరోయిన్లుగా అరుణ్ పవార్ దర్శకత్వంలో డా.కె.రవికిరణ్ నిర్మాతగా రూపొందిన చిత్రం 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్`. డిసెంబర్ 23న ఈ సినిమా విడుదలైంది. సినిమా సక్సెస్‌ను పురస్కరించుకుని యూనిట్ బుధవారం నుండి సక్సెస్‌టూర్‌ను ప్లాన్ చేశారు. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్ ప్రసాద్‌ల్యాబ్స్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో....
సప్తగిరి మాట్లాడుతూ - ``ప్రేక్షక దేవుళ్ళు మా సప్తగిరి ఎక్స్‌ప్రెస్ చిత్రాన్ని గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారు. దానికి మీడియా నుండి కూడా అండ దొరకడంతో సినిమా ప్రేక్షకులకు రీచ్ అయ్యింది. సినిమా ఆడియో విడుదల రోజు పవన్‌కల్యాణ్‌గారి ముందు ప్రేక్షకులు గర్వపడేలా సినిమా ఉంటుందని ఏ నమ్మకంతో అయితే మాట ఇచ్చాను. ఈరోజు ఆ నమ్మకం నిజమైనందుకు ఆనందంగా ఉంది. సినిమాటోగ్రాఫర్ రాంప్రసాద్‌గారు ప్రతి విజువల్‌ను అద్భుతంగా తీస్తే, గౌతంరాజుగారు సినిమాను ల్యాగ్ లేకుండా ఎంత బాగా కూర్చాలో అలా సినిమాను రెడీ చేసి ఇచ్చారు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి తెలంగాణ నుండి మంచి నిర్మాతను పరిచయం చేశాను. రవికిరణ్‌గారు భవిష్యత్‌లో గొప్ప నిర్మాతగా పేరు తెచ్చుకుంటారు. డీమానిటైజేషన్‌లో కూడా ఎనిమిది నెలలపాటు కొన్ని వందల మందికి నిర్మాతగారు పని కల్పించారు. కానీ కొంత మంది ఏదో మనసులో పర్సనల్ టార్గెట్‌గా పెట్టుకుని ఏదో రాసారు. మేం తప్పు చేస్తే ఓకే కానీ ప్రేక్షకులు మా సినిమాను ఆదరించారు. సప్తగిరి 12 ఏళ్ల కష్టంతో ఈ స్థాయికి చేరుకున్నాడు. మమ్మల్ని, మా కుటుంబ సభ్యుల్ని బాధ పెట్టడం వల్ల వారికేం వస్తుందో నాకు తెలియడం లేదు. ఏదైతేనేం సప్తగిరి గెలిచాడు, నిర్మాత గెలిచారు. ప్రేక్షకులు మమ్మల్ని గెలిపించారు`` అన్నారు.
దర్శకుడు అరుణ్ పవార్ మాట్లాడుతూ - ``ప్రేక్షకులు సినిమాను పెద్ద సక్సెస్ చేశారు. గౌతంరాజు, రాంప్రసాద్ వంటి సీనియర్ టెక్నిషియన్స్‌తో పనిచేయడం ఆనందంగా ఉంది. మా సక్సెస్‌ను ప్రేక్షకులతో పంచుకోవడానికి రేపటి నుండి టూర్‌కు వస్తున్నాం`` అన్నారు.
నిర్మాత డా.రవికిరణ్ మాట్లాడుతూ - ``దేవుడి దయ వల్ల సినిమా పెద్ద హిట్ అయ్యింది. గౌతంరాజుగారు, ఎన్.శివప్రసాద్, రాంప్రసాద్ వంటి సీనియర్స్ మినహా ఈ చిత్రంలో వీలైనంత మంది కొత్తవాళ్లను పరిచయం చేశాం. షకలశంకర్, షాయాజీ షిండే, పోసాని, హేమ సహా అందరి క్యారెక్టర్స్‌కు మంచి రెస్పాన్స్ వస్తుంది. చిన్న సినిమా అయినా క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. నిర్మాతగా ప్రారంభంలో కొన్ని తప్పులను చేసినా వాటిని కరెక్ట్ చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు సినిమా సక్సెస్‌ను ప్రేక్షకులతో కలిసి పంచుకోవడానికి రేపటి నుండి టూర్ వస్తున్నాం`` అన్నారు.
ఈ కార్యక్రమంలో సినిమాటోగ్రాఫర్ సి.రాంప్రసాద్, ఎడిటర్ గౌతంరాజు తదితరులు పాల్గొన్నారు.