నాగశౌర్య, రష్మిక మండన్నా హీరో హీరోయిన్లుగా ఐరా క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న చిత్రం `ఛలో`. శంకర్ ప్రసాద్ ముప్పలూరి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. వెంకీ కుడుముల దర్శకత్వంలో ఉషా ముప్పలూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్ విడుదల కార్యక్రమం శనివారం హైదరాబాద్‌లో జరిగింది. కార్యక్రమానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై టీజర్‌ను విడుదల చేశారు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ - ``నా దర్శకత్వ శాఖలో పనిచేసిన వారిలో వెంకట్ ఒకడు. తను తక్కువ కాలమే పనిచేసినా, నాకు ఇష్టమైన వారిలో తను ఒకడు. తన ప్రయాణంలో నేను కూడా ఒక మజిలీ. నా మజిలీ తర్వాత తను సినిమాను డైరెక్ట్ చేస్తుండటం నాకు ఆనందాన్నిచ్చే విషయం. నాకు సినిమా తప్ప వేరే విషయాలు గురించి పెద్దగా తెలియవు. సినిమా పెద్దది కావచ్చు చిన్నది కావచ్చు..అది రాజమౌళి అయినా, అవసరాల శ్రీనివాస్ అయినా..సాయికొర్రపాటి బ్యానర్‌తో నాగశౌర్య మొదలు పెట్టిన ప్రయాణం తన బ్యానర్ వరకు వచ్చింది. తన బ్యానర్‌లో మరిన్ని సినిమాలు చేయాలి. కొత్త బ్యానర్‌లో సినిమా చేయడం ఎంత కష్టమో నాకు తెలుసు. ఎందుకంటే నేను చేసిన స్వయంవరం అనే సినిమాకు కూడా చాలా కష్టాలు పడిన సంగతి తెలుసు. సినిమా తీయడం పెద్ద అవస్థ. ఆ అవస్థను ఈ యూనిట్ అధిగమించేసిందని నమ్ముతున్నాను. వెంకట్‌కు నా అభినందనలు`` అన్నారు.
దర్శకుడు వెంకీ కుడుముల మాట్లాడుతూ - ``తెలుగు సినిమా ఇండస్ట్రీనంతా ఓ యూనివర్సిటీలా భావిస్తే, అందులో త్రివిక్రమ్‌గారిని హయ్యస్ట్ కేడర్ ఉన్న ప్రొఫెసర్‌గా అనుకుంటాను. అటువంటి దర్శకుడి దగ్గర పనిచేయడం గర్వంగా ఫీలవుతాను. ఆంధ్రా, తమిళనాడు బార్డర్ లో జరిగే కాలేజ్ లవ్ స్టోరీ ఇది. హైదరాబాద్ నుంచి హీరో తిరుపురం వెళ్తాడు. నాగశౌర్యకు నటుడిగా మంచి పేరును తెచ్చిపెట్టే చిత్రమిది`` అన్నారు.
రష్మిక మండన్నా మాట్లాడుతూ - ``నేను కన్నడంలో కిరిక్ పార్టీ సినిమా చేసిన తర్వాత తెలుగులో అవకాశం వచ్చిన చిత్రమిది. నాపై నమ్మకంతో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్.
హీరో నాగశౌర్య మాట్లాడుతూ - ``నాకు త్రివిక్రమ్ గారంటే చాలా ఇష్టం. ఆయన చేతుల మీదుగా టీజర్ విడుదల కావడం ఎంతో ఆనందంగా ఉంది. ఆయన బ్యానర్‌లో ఎలాంటి సినిమాలు చేయాలని అనుకుంటున్నారో..నా బ్యానర్‌లో కూడా అలాంటి సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తాను. సహకారం అందించిన ప్రతి ఒక్కరికీ థాంక్స్`` అన్నారు.