శ్రీకాంత్, యజ్ఞశెట్టి హీరో హీరోయిన్లుగా అలివేలమ్మ ప్రొడక్షన్స్ పతాకంపై కరణం బాబ్జి దర్శకత్వంలో అలివేలు నిర్మిస్తున్న చిత్రం `ఆపరేషన్ 2019`. `బివేర్ ఆఫ్ పబ్లిక్`అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రం టీజర్ ఆవిష్కరణ కార్యక్రమం రిపబ్లిక్ డే సందర్భంగా శుక్రవారం హైదరాబాద్లో జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రెబల్ స్టార్ కృష్ణంరాజు టీజర్ లాంచ్ చేసిన అనంతరం మాట్లాడుతూ...``శ్రీకాంత్ నాకు తమ్ముడుగా `సింహగర్జన` లో నటించాడు. ఆ తర్వాత `నాన్నకు పెళ్లి` చిత్రంలో కొడుకుగా నటించాడు. తను మంచి నటుడే కాదు. మంచి మనసున్న వ్యక్తి కూడా. గతంలో చేసిన ఆపరేషన్ దుర్యోధన చిత్రం తనకు మంచి పేరు తెచ్చింది. ఇప్పుడు చేస్తోన్న ` ఆపరేషన్ 2019` టీజర్ కూడా చాలా బాగుంది. `బివేర్ ఆఫ్ పబ్లిక్` ఈ సినిమా క్యాప్షన్ చూసిన తర్వాత నాకు ఓ విషయం గుర్తొస్తుంది. అదేమిటంటే...నేను కాకినాడ నుంచి మొదట లోక్ సభ సభ్యుడిగా పోటీ చేసి మంచి మెజారిటీతో గెలిచాను. ఆ తర్వాత మా సొంతూరైన నర్సాపురం నుంచి పోటీ చేసి మళ్లీ మెజారిటీతో గెలిచాను. అక్కడ నేను చేసిన మంచి పనుల గురించి ప్రజలు ఇప్పటికీ చెప్పుకుంటుంటారు. కానీ ఆ తర్వాత రాజకీయాల్లోకి వ్యాపారవేత్తలు ప్రవేశించి ఓట్లు కొనడం ప్రారంభించారు. పబ్లిక్ కి కూడా డబ్బుపై ఆశ పెరిగింది. కాబట్టి పబ్లిక్ తో జాగ్రత్తగా ఉండాలి. వారిని మార్చే విధంగా సినిమాలు రావాలి. ఈ సినిమా టీజర్ చూస్తోంటే దర్శకుడు ఒక మంచి కాన్సెప్ట్ తో సినిమా తీసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా పబ్లిక్ ని ఎడ్యుకేట్ చేసే విధంగా ఉండబోతుందని అర్థమవుతోంది. ఆపరేషన్ దుర్యోధన చిత్రంలా శ్రీకాంత్ కు ఈ సినిమా మంచి పేరు తేవాలనీ, టీమ్ అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నా``అన్నారు.
నటుడు శివకృష్ణ మాట్లాడుతూ...``శ్రీకాంత్ ఎంత మంచి నటుడో అందరికీ తెలిసిందే. ఇందులో నాకు కూడా మంచి క్యారక్టర్ ఇచ్చారు దర్శకులు. చాలా క్లారిటీ ఉన్న దర్శకుడు. టీజర్లో కన్విక్షన్ ఉంది. చాలా డిఫరెంట్ గా ఉంది``అన్నారు.
నాగినీడు మాట్లాడుతూ...`` బివేర్ ఆఫ్ పబ్లిక్` అనే క్యాప్షన్ చూస్తూనే సినిమా ఎలా ఉండబోతుందో తెలుస్తోంది. పబ్లిక్ కి ఉపయోగపడే చిత్రమిదని`` అన్నారు.
నటి దీక్షాపంత్ మాట్లాడుతూ...``ఒక మంచి మెసేజ్ ఉన్న ఫిలింలో నేను కూడా పార్ట్ అవడం చాలా హ్యాపీ. అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు`` అన్నారు.
నటి హరితేజ మాట్లాడుతూ...``శ్రీకాంత్ గారితో నటిస్తూ చాలా నేర్చుకున్నాను. ఎంత ఎదిగినా ఒదిగుండే వ్యక్తిత్వం వారిది. ఈ సినిమాలో నేనొక డిఫరెంట్ క్యారక్టర్ చేశాను. నాకు మంచి పేరు తెచ్చే సినిమా అవుతుందన్నారు.
కృష్ణం రాజు సతీమణి శ్యామలాదేవి మాట్లాడుతూ...``మా నాన్నకు పెళ్లి చిత్రంలో నటించిన దగ్గర నుంచి శ్రీకాంత్ ని మా అబ్బాయిలాగే చూస్తాం. మంచి నటుడు. మర్యాద తెలిసిన వ్యక్తి. ఈ సినిమా పెద్ద సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా`` అన్నారు.
నిర్మాత అలివేలు మాట్లాడుతూ....``డైరక్టర్ బాబ్జి గారు మంచి కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. శ్రీకాంత్ గారు ఎంతో సహకరించడంతో సినిమాను అనుకున్న విధంగా చేయగలుగుతున్నాం. టీజర్ ఆవిష్కరణకు రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి దంపతులు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడం చాలా ఆనందంగా ఉందన్నారు.
దర్శకుడు కరణం బాబ్జి మాట్లాడుతూ...``శ్రీకాంత్ గారితో గతంలో `మెంటల్ పోలీస్` చిత్రాన్ని డైరక్ట్ చేశాను. ఆ సినిమా టైటిల్ వివాదం కావడం, రిలీజ్ ప్రాబ్లమ్ అవడంతో మేము అనుకున్న పేరు రాలేదు. మరోసారి శ్రీకాంత్ కాంబినేషన్ లో `ఆపరేషన్ 2019` చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నా. నన్ను నమ్మి మా నిర్మాతలు ఏ విషయంలో రాజీ పడకుండా సినిమాను నిర్మిస్తున్నారు. శ్రీకాంత్ గారు కూడా అన్ని విధాలుగా సహకరిస్తున్నారు. ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 6 వరకు చేయబోయే షెడ్యూల్ తో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది . శ్రీకాంత్ గారితో పాటు ఇందులో మరో ఇద్దరు యంగ్ స్టర్స్ నటించారు. త్వరలో వారెవరన్నది ప్రకటిస్తాం`` అన్నారు.
శ్రీకాంత్ మాట్లాడుతూ...``సింహ గర్జన`, మా నాన్నకు పెళ్లి చిత్రాల్లో కృష్ణంరాజు గారితో కలిసి నటించన దగ్గర నుంచి వారితో నాకు మంచి అనుబంధం ఏర్పడింది. `ఆపరేషన్ 2019` టీజర్ వారి చేతుల మీదుగా విడుదల కావడం చాలా సంతోషం. గతంలో కరణం బాబ్జీ దర్శకత్వంలో మెంటల్ పోలీస్ చేశాను. కానీ టైటిల్ కాంట్రవర్సీ, రిలీజ్ ప్రాబ్లమ్ వల్ల ఆ సినిమాకు అనుకున్నంత పేరు రాలేదు. ఈసారి కాంట్రవర్సీ లేకుండా మంచి కంటెంట్ తో సినిమా చేద్దాం అన్నాను. ఈ స్టోరీ చెప్పాడు. ఇందులో కాంట్రవర్సీ ఉన్నా కంటెంట్ బావుంది. కచ్చితంగా అందరికీ నచ్చుతుందన్న నమ్మకం ఉంది.మా నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా సినిమా నిర్మిస్తున్నారు. షకీల్ ఆరు అద్భుతమైన పాటలిచ్చారు`` అన్నారు.