10 September 2017
Hyderabad
యంగ్‌టైగర్ ఎన్టీఆర్, నివేదా థామస్, రాశిఖన్నా హీరో హీరోయిన్లుగా నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బేనర్‌పై రూపొందుతోన్న చిత్రం `జై లవకుశ`. కె.ఎస్.రవీంద్ర(బాబి) దర్శకుడు. నందమూరి కల్యాణ్‌రామ్ నిర్మాత. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ వేడుక హైదరాబాద్‌లో ఆదివారం సాయంత్రం జరిగింది. ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్‌తో పాటు సుకుమార్, వి.వి.వినాయక్ హాజరయ్యారు. .
సుకుమార్ మాట్లాడుతూ ``ఈ సినిమా చూశాక ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొట్టుకుంటారేమోనని, వారిలో చీలిక వస్తుందేమోనని అనిపిస్తోంది. ఎందుకంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ జైకి కొంత మంది, లవకి కొంతమంది, కుశకి కొంతమంది ఫ్యాన్స్ గా మారిపోతారేమోనని అనిపిస్తోంది. అలా కాకూడదని కోరుతున్నా. నాకు నచ్చిన చంద్రబోస్ ఇందులో పాట రాశారు. దేవి మంచి ట్యూన్లిచ్చారు`` అని చెప్పారు.
బీవీయస్‌యన్ ప్రసాద్ మాట్లాడుతూ `` ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి`` అని తెలిపారు.
కొరటాల శివ మాట్లాడుతూ ``అన్నయ్య ఇందులో మూడు పాటలు చూపించారు. ఎన్టీఆర్ మా జనతాగ్యారేజ్‌లో అంతగా డ్యాన్సులు వేయలేదు. ఈ సినిమాలో చాలా బాగా వేశారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉంటుందో మనకు తెలుసు. ఈ సినిమాలో మిగిలిన ఆర్టిస్టులకు కాస్త ఇబ్బంది. ఎందుకంటే ఎన్టీఆర్ ఒక పాత్రలో చేస్తేనే అద్భుతంగా ఉంటుంది. అలాంటిది ఆయన మూడు పాత్రల్లో చేయడం చాలా హ్యాపీ. బాబీ చాలా బాగా స్క్రిప్ట్ రాసుకున్నాడు. టీమ్ అందరూ చాలా కష్టపడి పనిచేశారని అర్థమవుతోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లో ఎన్టీఆర్ సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. అన్న నిర్మాతగా, తమ్ముడు హీరోగా చేయడం పెద్ద ఈవెంట్ అవుతుందని, ఈ నెల 21 కోసం నేను కూడా వెయిట్ చేస్తున్నా`` అని చెప్పారు.
రాశీఖన్నా మాట్లాడుతూ ``అభిమానుల ప్రేమాభిమానాలను చూస్తుంటే చాలా అమేజింగ్‌గా ఉంది. ఈ సినిమాలో తారక్ చూపించిన వేరియేషన్స్ చూసి నేను ఆయనకు ఫ్యాన్‌ని అయ్యాను. ఆయన చాలా బ్రిలియంట్ పెర్ఫార్మర్? అందరూ చెబుతుంటే విన్నాను కానీ, ఆయనతో పనిచేసేటప్పుడే నాకు ఆయనలోని టాలెంట్ తెలిసింది. ఆయన డ్యాన్సింగ్‌లో బెస్ట్. ఈ సినిమాకు ఆయన ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. ఈ సినిమా యూనిట్‌కి తెలుసు. నేను తారక్ దగ్గర చాలా నేర్చుకున్నాను. మూడు పాత్రల్లోనూ ఆయన డ్యాన్సులు చేయడం, పెర్ఫార్మ్ చేయడంలో చాలా వేరియేషన్స్ చూపించారు. బాబీ కథ చెప్పినప్పుడు నాకు ఐడియా చాలా బాగా నచ్చింది. ఈ సినిమాకు పనిచేసినందుకు చాలా ఆనందగా ఉంది`` అని తెలిపారు.
నివేదా థామస్ మాట్లాడుతూ ``ఎన్ని కాస్యూమ్స్ ని చేంజ్ చేసుకోవాలన్నా, ఫీవర్ ఉన్నా, జలుబున్నా.. ఒక వైపు బిగ్‌బాస్ షో చేయాల్సి వచ్చినా ఎంతో హుషారుగా కనిపించిన వ్యక్తి తారక్. ఈ సినిమా తారక్ బెస్ట్ ఫిల్మ్ అవుతుంది. నేను కొన్ని సార్లు డల్‌గా ఉన్నప్పటికీ తారక్ నన్ను యాక్టివ్‌గా మార్చేవారు`` అని తెలిపారు.
కోన వెంకట్ మాట్లాడుతూ ``ఒక రోజు ఎన్టీఆర్ 79సార్లు డ్రెస్‌లు మార్చుకున్నాడు ఈ సినిమా కోసం. అసాధ్యాన్ని సాధ్యం చేయాలంటే అది ఎన్టీఆర్‌కి సాధ్యం. బాడీ లాంగ్వేజ్‌ని బట్టి మూడు పాత్రల్లోనూ ఒదిగిపోయాడు. సెప్టెంబర్ 21న అభిమానులకు పెద్ద పండుగ. సాంబ, అదుర్స్ తర్వాత బాద్‌షా.. ఈ మూడు సినిమాలకు నేను తారక్‌తో పనిచేశా. ఈ మూడు సినిమాలు కలిపి ఈ సినిమా అవుతుంది. ఎన్ అంటే నాటీ.. అది కుశుడు. టి అంటే టెర్రర్ అది జై, ఆర్ అంటే రిలయబుల్ .. అది లవ్‌కుమార్. హీరో టాలెంట్‌ని నమ్మి రచయిత స్టోరీ రాస్తాడు. దానికి 100 శాతం న్యాయం చేసేది హీరోనే`` అని తెలిపారు.
వినాయక్ మాట్లాడుతూ ``ఎన్టీఆర్ రావణ పాత్ర చేయడానికి చాలా ఇష్టపడి చేశాడు. ఇంత మంచి సినిమా చేసిన బాబీకి హిట్ కావాలి. ఇది తమ్ముడికి అన్నయ్య ఇస్తున్న గిఫ్ట్. అన్నదమ్ములు ఇద్దరు కలిసి వాళ్ల నాన్నగారికి ఇస్తున్న గిఫ్ట్. ఆయన వాళ్ల నాన్నగారికి ఇస్తున్న గిఫ్ట్. ఛోటా ఫొటోగ్రఫీ ఎవర్‌గ్రీన్. ప్రకాశ్ సెట్స్ చాలా బావున్నాయి. ఇంత తక్కువ టైమ్‌లో ఈ సినిమా కావడానికి కారణం చోటాగారు. అదుర్స్ 2 కూడా తప్పకుండా చేస్తాం. దేవిశ్రీ చాలా మంచి సాంగ్స్ ఇచ్చాడు`` అని అన్నారు.
Glam gallery from the event |
|
|
|
బాబీ మాట్లాడుతూ ``తారక్‌గారితో చేసిన ఈ సినిమా గురించి సంవత్సరం మాట్లాడాలి. తారక్‌గారు లాంటి గొప్ప కొడుకును కన్నందుకు వాళ్ల అమ్మానాన్నలకు థాంక్స్ చెబుతున్నా. తెలుగు పరిశ్రమ గొప్పగా చెప్పుకునే నటుడు తారక్. ఈ సినిమాను డైరక్ట్ చేసినందుకు నేను అదృష్టవంతుడిగా ఫీలయ్యాను. సీజీ వర్క్ ఫస్ట్ డే చేసినప్పుడు నాకు సపోర్ట్ చేసింది ఎన్టీఆర్. ఆరోజు టోటల్ కమాండ్, కంట్రోల్ ఎన్టీఆర్‌గారి దగ్గర ఉన్నదంటే ఆయన చాలా గ్రేట్. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటా. కల్యాణ్‌రామ్‌గారు ప్రెస్టీజియస్‌గా చేస్తున్న సినిమా ఇది. టీమ్ మొత్తం చాలా కష్టపడి చేశాం. కోనవెంకట్, చక్రి కూడా చాలా హెల్ప్ చేశారు. నా టీమ్ చాలా బాగా సాయపడ్డారు`` అని తెలిపారు.
.దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ ``తారక్‌తో ఇది కంటిన్యుయస్‌గా మూడో సినిమా. నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ తర్వాత ఇది నాకు ఆయనతో మూడో సినిమా. ఈ సినిమాలో ఒక సీన్ను చాలా మంది స్క్రీన్ షాట్స్ తీసి పెడుతున్నారు. ఆ సీన్‌లో ఎన్టీఆర్ యాక్టింగ్ చూసి చాలా అబ్బురపడ్డా. ట్రిపుల్ రోల్స్ చేసేటప్పుడు మామూలుగా స్లాప్స్టిక్ కామెడీ ఉంటుంది. కానీ ఇందులో చాలా సీరియస్‌గా ఉంటుంది. తారక్ నటనను నేను ఎంజాయ్ చేస్తూ రీరికార్డింగ్ చేశాను. ఇంత మంచి స్క్రిప్ట్ ను నాకు ఇచ్చిన బాబీకి థాంక్స్. చాలా బాగా పిక్చరైజ్ చేశారాయన. తనకు చాలా మంచి పేరు వస్తుంది`` అని తెలిపారు.
కల్యాణ్‌రామ్ మాట్లాడుతూ ``తమ్ముడితో సినిమా చేస్తున్నప్పుడు అందరి ఎక్స్ పెక్టేషన్స్ కి మించి ఉండాలని అనుకున్నా. బాబీ చెప్పిన 10 నిమిషాల స్క్రిప్ట్ విని దానవీరశూరకర్ణ సినిమా గుర్తుకొచ్చింది. ఆ సినిమాను ఎవరూ టచ్ చేయకూడదన్నది నా ఫీలింగ్. ఆ తర్వాత అంత ఫీల్ వచ్చింది ఈ కథ విన్నప్పుడు. తారక్ తప్పించి ఎవరూ ఈ సినిమాను చేయలేరు. బాబీ నాకు టైటిల్‌తో కూడా కథ చెప్పారు. తారక్‌కీ, నాకూ మామూలుగా వేరే లెవల్ డిస్కషన్స్ జరుగుతుంటాయి. జనతాగ్యారేజ్ పెద్ద సక్సెస్ అయిన తర్వాత ఈ బ్యానర్‌లో ఇద్దరూ కలిసి ఎలాంటి సినిమాలు చేస్తే బావుంటుందోనని చాలా డిస్కస్ చేసుకున్నాం. ఈ సినిమా కథ విని తారక్ వారం రోజులు సమయం తీసుకున్నాడు. ఎందుకంటే తారక్ ఒక కన్విక్షన్ కోసం తీసుకున్నాడు. నత్తి పాత్ర కోసం ప్రిపేర్ కావడం కోసం తను ఆ వారం తీసుకున్నాడని నాకు తర్వాత అర్థమైంది. ముందు మేం రావణ పాత్రను చిత్రీకరించాం. ఒక రోజు రాత్రి మూడింటికి నిద్రలో లేచి నడుచుకుంటూ నత్తితో మాట్లాడుతున్నాడు. నడుచుకుంటూ వెళ్లిపోయి కిటికీలో గుచ్చుకున్నాడు. మర్నాడు ప్రణతి ఫోన్ చేసి చెప్పితే తప్ప నాకు విషయం తెలియదు. తను అంతగా ఈ సినిమాలో ఇన్వాల్వ్ అయ్యాడు. వారం రోజులు షూటింగ్ ఆపుదామని అంటే తారక్ ఒప్పుకోలేదు. సెప్టెంబర్‌లో విడుదల చేస్తామని ప్రామిస్ చేశాం కదా అన్నా అని చెప్పాడు. షూటింగ్‌లో అన్ని కాస్ట్యూమ్స్ ఎవరూ మార్చరు. కానీ తారక్ మార్చాడు. ఈ సినిమాకు టెక్నీషియన్స్ కూడా అంతే సహకరించారు`` అని చెప్పారు.
హరికృష్ణ మాట్లాడుతూ ``అన్నదమ్ముల అనుబంధం చూస్తుంటే ఆనందంగా ఉంది. ఈ సినిమా నిర్మాణానికి ఆద్యుడు స్వర్గీయ జానకిరామ్ బాబు. వాళ్ల ముగ్గురూ కూర్చుని తాతగారి పేరున్న బ్యానర్‌లో తాతగారి పేరు పెట్టుకున్న తమ్ముడితో సినిమాలు చేయాలి కదా.. అని అనుకున్నారు. అలా ఈ సినిమాకు బీజం పడింది. దానికి అనుగుణంగా ఇద్దరు అన్నదమ్ములు నడుస్తున్నారు`` అని చెప్పారు.
ఎన్టీఆర్ మాట్లాడుతూ ``ఇంకో జన్మంటూ ఉంటే నా తల్లిదండ్రుల రుణం తీర్చుకుంటా. ఈ జన్మకు మాత్రం అభిమానులతో ఉంటా. అభిమానుల ప్రేమానురాగాలు ఎన్నో జన్మల సుకృతం. అభిమానుల దగ్గర నాకు ఎప్పుడూ ఎమోషనే ఉంటుంది. రక్తం ధారం పోసి అభిమానులతో ఇలాగే ఉండాలని మాత్రం ఒప్పుకుంటా. అభిమానులు నా మీద పెట్టుకున్న నమ్మకమే నాకు ముఖ్యం. అభిమానులు గర్వంగా తలెత్తుకుని తిరిగే రోజు వరకు నేను ఇలాగే పోరాడుతూనే ఉంటా. మంచి సినిమాలు తీసి తప్పకుండా తీస్తూనే ఉంటా. వీలైతే ఈ జన్మలో.. లేకుంటే మరో జన్మలో. దేవుడు కనికరించాడు, మా దర్శకులు ఫోకస్డ్ గా ఉన్నారు, అభిమానులు చల్లగా చూశారు కాబట్టే ఈ స్థాయిలో ఉన్నాను. ఈ మూడు లేకపోతే ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు. నా గత సినిమాలన్నీ వరుసగా ఒకదానికి ఒకటి ఆజ్యం పోశాయి. మా బ్యానర్‌లో సినిమా చేద్దామని అనుకున్నప్పుడు ఎలాంటి సినిమా చేయాలో నిజంగా అర్థం కాలేదు. కేవలం మాకు ఒకటే. సినిమా హిట్టూ , ఫ్లాప్‌లూ మన చేతిలో లేవు. అది దైవ నిర్ణయం. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం అభిమానులు సినిమా చూసి ఏం తీశార్రా అన్నాదమ్మలు అనుకోవాలి. ఎంత బాగా చేశార్రా మా పిల్లలు అని అన్నాదమ్ములు అనుకోవాలి. మనిద్దరం అద్భుతమైన సినిమా చేశామని అనుకోవాలి అని అనుకున్నాం. అలా మేం మాట్లాడుకున్న మాటలు విని దేవుడు బాబీని పంపాడేమో.. బాబీ కథ చెప్పగానే తన చెయ్యిపట్టుకున్నా. ముందు భయం వేసింది.. ఈ సినిమా చేయగలుగుతానా? అని. కానీ మా డ్రీమ్‌కి కావాల్సినటువంటి ఆయుధాలు మొత్తం ఆ కథలో ఉన్నాయి. కొన్నాళ్ల తర్వాత కలుద్దామని బాబీకి చెప్పి వదిలేశా. కానీ ఎక్కడో మనసులో ఈ కథ గురించి ఆలోచిస్తున్నా. కానీ ఎలా చేయాలో, ఎలా చెప్పాలో అర్థం కాలేదు. కానీ తర్వాత ఒకరోజు బాబీని పిలిచి.. నాకు అత్యంత దగ్గరైన ఇద్దరు ఆప్తులతో ఈ కథని షేర్ చేసుకున్నా. ఈ సినిమా సూపర్ హిట్ అయితే ఇద్దరి పేర్లూ చెబుతా. అప్పటి వరకు మాత్రం చెప్పను. కానీ వాళ్లు ప్రోత్సహించడంతో ముందడుగువేశాను. ఆ రోజు నుంచే ఈ సినిమా ప్రయాణం మొదలైంది. ముందు కనిపించేది ఒకటే. అందరి చిరునవ్వులు, అందరూ గర్వకారణంగా ఉండాలి ఈ సినిమా అని తప్ప నాకు ఇంకే ధ్యాసా లేదు. పరుగులు తీసి చివరికి ఇలా అందరి ముందు నిలుచున్నాను. బావుంటుందని నమ్ముతున్నా. అనుకుంటున్నా. తప్పకుండా అందరికీ గర్వకారణంగా ఉంటుందని మాత్రం చెప్పగలను. మా తల్లిదండ్రులకు, మా అన్నదమ్ములకు కూడా గర్వకారణంగా ఉంటుంది. మా తాతగారి చేతిలో ఉంటుంది. దేవి చాలా సపోర్ట్ చేశారు. చోటాగారితో పనిచేస్తే ఆ చిత్ర యూనిట్ మొత్తం రిలాక్స్ అయిపోతుంది. ఈ సినిమా సకాలంలో విడుదల కావడానికి కారణం ఆయనే. పూణే షెడ్యూల్‌లో ఆయన పడ్డ కష్టం అంత తక్కువేం కాదు. కోన , చక్రి చాలా బాగా సపోర్ట్ చేశారు. బాబీ కాన్ఫిడెన్సే ఈ సినిమా సక్సెస్`` అని తెలిపారు.