పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మంచు ఎంటర్‌టైన్‌మెంట్ రూపొందిస్తున్న చిత్రం `వైఫ్ ఆఫ్ రామ్`. మంచు లక్ష్మి, ఆదర్శ్ బాలకృష్ణ, ప్రియదర్శి, సామ్రాట్ రెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రధారులు. టి.జి.విశ్వప్రసాద్, లక్ష్మీ మంచు నిర్మాతలు. విజయ్ యేలకంటి దర్శకుడు. ఈ చిత్రం ట్రైలర్‌ను మంచు మోహన్‌బాబు శుక్రవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు.
మోహన్‌బాబు మాట్లాడుతూ `` నిర్మాత అమెరికాలో ఉంటాడని, తనను నమ్మి మొత్తం చిత్రాన్ని తనమీదే వదిలేశాడని లక్ష్మీ చెప్పింది. అది కరెక్ట్ కాదు. నిర్మాత నిర్మాతలాగే ఉండాలి. నా బిడ్డను నమ్మి అలా వదిలేయడం నాకు గర్వమే. కానీ తన బడ్జెట్‌ని తను దగ్గరుండి చూసుకోవాలి. లెక్కలు రాసుకోవాలి. ఒకరి మీద ఆధారపడకూడదు అని చెప్పాను. నా కూతురి గురించి చెప్పాలంటే నాకు ఎప్పుడూ గర్వంగా ఉంటుంది. నా కూతురు రాణిస్తోందంటే గర్వంగా ఉంటుంది. తన ఇష్టాన్ని ఆ దిశగా ప్రోత్సహించిన నా అల్లుడు గొప్పతనమది. ఆయన్ని అభినందిస్తున్నా. ఎన్ని రకాల సినిమాలు వచ్చినా ఉన్నది ఒకటే కథ. వండే విధానంలో తేడా ఉంటుంది. దాన్నే స్క్రీన్‌ప్లే అంటారు. ఈ సినిమా గురించి నాకు పూర్తిగా కాకపోయినా, కొంతవరకు తెలుసు. కొన్ని సన్నివేశాలు చూశాక దర్శకుడి విజన్ నాకు అర్థమైంది. బాగా తీశాడు. మంచి థ్రిల్లర్ చిత్రమిది. నేను ఈ మధ్య కొన్నాళ్లుగా అమెరికాలో ఉన్నాను. మా గురువుగారి లేని లోటు కనిపిస్తోంది. ఇండస్ట్రీలో చిన్నా, పెద్దా అనే ఆలోచన ఉండాలి. ఆయన లేని లోటు కనిపిస్తోంది. ఈ మధ్య కాలంలో పరిశ్రమలో జరిగిన వాటికి నేను చాలా బాధపడ్డాను. ఈ నెల 23 నుంచి 27 వరకు దైవసన్నిధానంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. అందరూ భాగస్వామ్యులు కావాలి`` అని అన్నారు.
మంచు లక్ష్మీ మాట్లాడుతూ ``పరిశ్రమలో అడుగుపెట్టినప్పటి నుంచి నేను కృతజ్ఞతాభావంతో మెలుగుతున్నాను. మా నాన్నతో వేదిక పంచుకున్నందుకు గర్వపడుతాను. సినిమాలకు సంబంధించి మా కుటుంబానికి మా నాన్న గట్టి పునాది వేశారు. థ్రిల్లర్ చిత్రమిది. స్నేహితుడిలా నాతో కలిసి పనిచేశాడు. మంచి టెక్నీషియన్స్ కుదిరారు`` అని చెప్పారు.
ఈ సినిమాలో నటించినందుకు ఆనందంగా ఉందని ఇతర నటీనటులు తెలిపారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల, దర్శకుడు విజయ్ యేలకంటి, కెమెరా: సామల భాస్కర్, సంగీతం: రఘు దీక్షిత్, ఎడిటర్: తమ్మి రాజు, మాటలు: సందీప్ రెడ్డి గంటా, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వంశీ కృష్ణ నాయుడు, విజువల్ ఎఫెక్ట్స్: ఉదయ్ కృష్ణ.