పాత చింతకాయ పచ్చడి!
మరీ అంత చీపుగా చూడకండి పాత చింతకాయ తొక్కుని! బజార్లో దొరికే అడ్డమైన పిజ్జలూ, నిలువెత్తు బర్గర్లూ, నానా కస్మారం కలిపి రంగూ రుచీ వాసనలను తారుమారు చేసిన తిళ్ళను తినీ తినీ చవచచ్చిన నాలుకకి, ఒక్కోసారి వంటింట్లో ఎక్కడో పింగాణీ జాడిలో గుడ్డ చుట్టబడి ఓ మూలకి నెట్టబడి ఈ మధ్యకాలంలో మూత తీయబడని పాత చింతకాయ పచ్చడే సంజీవనీ మంత్రం. జావ కారిపోయిన జీవానికి కాస్త ఈ పచ్చడిని కొండ నాలుక్కి తగిలించామా, నరాలు జివ్వుమని పంచ ప్రాణాల పంచదార చిలకలు రివ్వుమని రెక్కలు విప్పుకొని ఆకాశపుటంచులను ముద్దుపెట్టుకుని రావూ! అందుకని పాత చింతకాయ పచ్చడిని ఊరికే ఓ మూలకి తోసేయమాకండి! అవును 'అల వైకుంఠపురములో' పాత చింతకాయ తొక్కే!
'మహాప్రస్థానం' మహాకావ్యానికి ముందు మాట రాస్తూ చలం, ఈ కవిత్వన్ని కొలిచే తూనిక రాళ్ళు తనవద్ద లేవంటాడు. నిజమే! కళా దృష్టి ఉండడం ఎంత ముఖ్యమో, ఏ కళని ఏ దృష్టితో చూడాలో ఆస్వాదించాలో తెలుసుకునే వివేచన కలిగి ఉండడం, ఏదో పెద్ద గొప్ప సంగతని కాదు, ఉంటే చిన్న చిన్న ఆనందాలకి అది అడ్డు రాదు. అప్పుడు చాప్లిన్ అరటి తొక్క మీద కాలు వేసి జారి పడకుండా నిలదొక్కుకునేందుకు చేసే కసరత్తులకీ హాయిగా నవ్వుకోవచ్చూ, 'మిస్సమ్మ ' లో రామారావు అటు సావిత్రినీ సమధాన పరచలేక ఇటు యస్వీయార్ దంపతులకీ చెప్పుకోలేక చెప్పే అడ్డమైన అబద్ధాలకీ, చేసే అడకత్తెర విన్యాసాలకీ భేషుగ్గా చిరునవ్వులు చిందించ్చనూ వచ్చు. ఎందుకుకంటే ఈ రెండు తరగతులూ, వాటి తూనిక రాళ్ళు వేరు. ఒకటి మనలోని పసితన్నన్ని చక్కలిగింతలు పెట్టేది, మరొకటి మనలోని ఆపద్ధర్మాన్ని ఎత్తిచూపి నవ్వు తెప్పించేది. నవ్వే మనసు ఒకటే అయినా, నవ్వే కారణాలు వేరు. ఇందులో ఏదీ తక్కువ కాదు, ఏదీ ఎక్కువ కాదు. అందుకని వైకుంఠపురంలో కథా విలువలు ఉన్నాయా, కథనంలో బరువు ఉందా, వాటి పాత్రల ఔచిత్యాలు ఏమిటి, సమాజ పరంగా రచయిత బాధ్యత ఏమిటి! సారీ మేష్టారు! అది వేరే క్వశ్చెన్ పేపరు! అది వేరే సిలబసు! మొన్న 'ఇస్మార్ట్ శంకర్ ' పాటలో చెప్పినట్టు 'అది ఇది గాద్!' ఆ తూనిక రాళ్ళు వేరు!
అలా వైకుంఠపురం కేవలం ఒక విశ్రాంత హాస్య చిత్రం మాత్రమే. ఇందులో హాస్యం విరామ సంగీతం కాదు, ఆ పాత్ర కథా కథనాలవి. వాటి పని హాస్యం నడవడానికి అవసరమయ్యే చేతి కర్రలుగా మాత్రమే, జోకు పండడానికి పనికొచ్చే పోక చెక్కలు మాదిరి! అందుకే చెల్లెలి చున్నీ పట్టి లాగిన వాడిని లాగి పెట్టి కొట్టాల్సింది పోయి, వెళ్ళి వాడి కాళ్ళు పట్టుకుంటాడు హీరో (పుట్టిన వెంటనే కెవ్వుమని ఏడవని పసిపాపల కాళ్ళు డాక్టరు పట్టుకునే పద్ధతిలో.... ఆ తరువాత చర్రున ఇచ్చే 'అమ్మనీ అవసరమీ దెబ్బ ' తో సహా!)! ఇందులో సమస్యలు పెద్దవే అయినా పరిష్కారాలు అన్నీ ఫక్కుమని నవ్వు తెప్పించేవే! అల్లుకున్న సందర్భాలే పడాల్సిన ప్రాస కోసమో ('ఇక్కడ వీడు చెప్పడాలు అవలేదు, నువ్వు అప్పడాలు తెచ్చావా!', అంటే రచయిత గారికి ఎప్పుడో ఈ ప్రాస తమాషాగా తగిలి, దాన్ని ఎక్కడో వాడాలి అనిపించి, సెట్ ప్రాపర్టీస్ వారిని, ఈ సీనుకి 'బాబూ ఓ పది అప్పడాలు వేయించి తెప్పించండి! అవసరం ఉందీ' అని అన్నటుగా ఉంటుంది!), లేదా దంచాల్సిన లెక్చరు కోసమే అన్నట్టుగా మామూల్గు ఉన్న పాత్ర హాఠాత్తుగా విపరీతమయి పోతుంది! హాస్యా తురాణాం న కధా న కధానం! Everything is fair in love and war అన్నవాడు మిస్స్ అయ్యింది మరొకటి ఉంది, ‘and comedy’ అని కలపడం. 'హలో బ్రదర్ ' సినిమలో ఒక పాత్ర 'ప్రియా! నీ అధరామృతాన్ని గ్రోలాని ఉంది ' అంటే 'గ్రోలడానికి అదేమన్న గోల్డ్ స్పాటా? ఉమ్ము!' అని తీసి పారేస్తుంది, ఇవన్నీ రివర్స్ ఇంజనీర్డ్ జోకులే! హాస్యం కోసం సందర్భం సృష్టించడం. చటుకున్ని నవ్వేసి చిటుక్కున పక్కకెళ్ళి పోవాలే తప్పితే తీరిగ్గా తర్కించి లోతుగా చర్చించే డెప్త్ ఇందులో ఏమీ లేదు! మంచి విషయమేమిటంటే రచయిత అటువంటి ఉద్దేశ్యం కూడా ఉన్నట్టు ప్రకటించక పోవడం! అందుకనే తన చెల్లి చున్నీ లాగిన వాడి మీద కోపమూ తెచ్చుకోడు, తను పర స్త్రీ కాళ్ళ వంక తమకంగా తదేకంగా చూస్తున్నా తప్పనుకోడు! కనీసం పాత్ర లో ఒక విధమయిన కన్సిస్టెన్సీ ఉంది.
ఈ సినిమాకి రచయితకి ఎన్ని మార్కులు పడాలో అందుకు ఒకటి ఎక్కువ దర్శకుడికి పడాలి. ఫక్తు ఫార్ములా బొమ్మ ఇది. ఇంకా చెప్పాలంటే 60ల నించి 80ల దాక ప్రతి హీరోకి అటు అత్తా అల్లుళ్ళ మోటు నాటు సరసపు హిట్టు బొమ్మ ఎలా పడాలో, అలాగే బయట నించి వచ్చి పరాయి ఇంటి వ్యవహారాలు చక్క పెట్టే మార్కు చిత్రం తన ఖాతాలో తప్పని సరి (వీటన్నిటికీ పెద్దన్న 60 లలో వచ్చిన హృషికేష్ ముఖర్జీ 'బావర్చీ' చిత్రం). ఇదీ గిరి అని గీసుకున్నాక కబడ్డీ ఆటకు మల్లే దానికి ఎంత దగ్గరగా వెళ్ళి వెంటనే వెనక్కు రావాచ్చో (కాదు... వెనక్కు రావాలో) తెలుసుకోవడమే దర్శకుడి విఙ్ఞత. ఇదే రచయితది 'అత్తారింటికి దారేదీ' కి దీనికి అదే తేడా! అందులో అన్నీ హీరోకి ఆలవోకగా అందేసే సందర్భాలు! అత్త దగ్గరకు వెళ్ళాలా, అత్త వేయి పడగలెత్తితే హీరో కోట్లకు పడగలెత్తుతాడు, హీరోయిన్ ని అప్పటి దాక పట్టించుకోని హీరో, సందర్భం వచ్చిన వెంటనే లిటరల్ గా హీరో గారి పక్కన వచ్చి టపీ మని పడుతుంది (జీపులో), సందర్భాలన్నీ హీరో బాట నించి ముళ్ళు తీసేందుకే, ప్రతి పాత్రా హీరో గారి సేవకే, అవసరానికే! (ఇదే రచయిత మరో సినిమా డైలాగు ఉదహరించాలంటే "ఆ కోటేదో నాకివ్వండి, వడ్డీ కి తిప్పి మీకే నెలకి లక్ష ఇస్తా" అన్నట్టు, అన్నీ సమకూరితే ఇక హీరో పాత్ర ప్రఙ్ఞ ఏమిటో!). వైకుంఠపురం లో ఆ తప్పు దిద్దుకున్నట్టే కనపడ్డాడు రచయిత/దర్శకుడు. ఫార్ములా చిత్రం కాబట్టి, ఇక్కడ కూడా హీరో అవసరానికే తగ్గట్టు చిక్కు ముళ్ళు విడిపోతాయి, కానీ ఇక్కడ హీరో సంస్కారం అవన్నీ తన ప్రయోజకత్వమే అన్నట్టు ప్రవర్తించక పోవడం. ముఖ్యంగా మెచ్చుకోవల్సినది హీరో కేరెక్టర్ టోన్. ఇంచు మించు 'అతడు ' (టోన్ విషయంలో) కాస్త దగ్గరగా ఉంటుంది. ఇక్కడ హీరో ప్రవర్తన (హాస్యం కావచ్చు, కోపం కావచ్చు) ఒక బాధ, ఒక అవసరం నించి వస్తాయి (అత్తరింటికి లో పొగరు, అహంకారం నించి వచ్చినట్టు). దానితో మధ్య తరగతి సర్దుకుపోయే తత్వం ప్రతి చోట దర్శనం ఇస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే సినిమాలోని పాత చింతకాయ ఫార్ముల ని పూర్తిగా నిలబెట్టింది ఈ నవ తరం స్థిత ప్రఙ్ఞత్వం. తండ్రి కాని తండ్రి నలుగురిలో చెంప పగలకొట్టినా వెంటనే స్పందించడు, తన బ్రతుకు తాలూకు రహస్యం తెలిసినా వెంటనే ఎగిరి గంతేయుడు (కథా పరంగా అది అవసరమనుకున్నా టోన్ పరం గా అది అంతకంటే ముఖ్యం). ఇటు వంటి కమర్షియల్ సినిమా మోళీ ఆట లో, హీరో ని అంతెత్తు ఒంటి స్థంభం మీదకి పాకించి దాని చివరన పొట్ట మీద పడుకోపెట్టించి అక్కడే నిలపగలగడానికి ఒకే కారణం - నిలకడ (మళ్ళీ ఒక మధ్య తరగతి విలువ). ఆ నిలకడ మీదే మొత్థం సినిమా నిలబడింది అంటే అతిశయోక్తి కాదు.
సాంకేతిక విషయల్లో ప్రస్ఫుటంగా కనిపించేది ఫైట్స్. సహజంగా పెద్ద హీరో అనగానే మహాత్మా గాంధీ నరేగా చట్టం కింద ఒక పది పరిశ్రమలకి ఉపాధి కల్పనా కార్యక్రమం గా కాకుండా (తన్నించుకునే వాళ్ళు, పగిలేవి, విరిగేవి, క్రీస్తు పూర్వపు యుద్ధ ఆయుధ సామగ్రి, పేళ్ళుళ్ళు తదితర విధ్వంస రచన), ప్రతి ఫైట్ ఒక బాలే గా తీర్చిదిద్దడం చాలా బావుంది. స్పెయిన్ దేశం లో ప్రసిద్ధి పొందిన బుల్ల్ ఫైట్ లు చేసే మేటేడార్లు ఈ పోరాటలకు స్ఫూర్తి అన్నది తేటతెల్లమవుతోంది (ఫైట్ జరుగుతున్నప్పుడు శూన్యత ఆవరించిన హీరో ఎక్ష్ప్రెషన్ ని చూస్తే, ఈ తన్నుడు ఒక రోజు వారీ తంతుగా, ఒక తప్పని పనిగా అన్నట్టు). గాలిలో విన్యాసాలు కాస్త ఎక్కువే ఉన్నా దాని పూర్వా పరాలని (సింబాలికగా బట్టలని ఉతికి ఝాడించం వంటి) మళ్ళీ హాస్యంలో ముంచడం చేత ఏదీ అతి అనిపించదు. (విడుదలయిన) పాటలు విడిగా వినడానికి ఎంత హాయిగా ఉన్నా (ఈ మధ్య కాలంలో తెలుగు పాటల్లో వింపించని long phrases ని సామజ వర గమన లో వాడడం సంగీత దర్శకుడి ఆత్మ విశ్వాసానికి నిదర్శనం), చూసేటప్పుడు ఆకట్టుకునేది 'రాములో ' పాట ఒక్కటే. ఇంక చివరి 'పోరాట పాట ' (ఏదో ఉయ్యాల పాటల్లే) దర్శకుడి అలోచనకీ, పాట రచయిత జానపద భాషకీ, ఇక తమన్ అద్భుతమైన స్వరానికి (మరీ ముఖ్యంగా music arrangement కీ) ఒక మెచ్చు తునక.
నటులలో మిగతా వారిని ఆమడ దూరంలో వదిలేసి గట్టిగా లగెత్తిన వాడుగా మురళీ శర్మ మిగిలిపోతాడు. (గుండమ్మ కథలో రమణా రెడ్డి పాత్రల్లే) విలనీ కి, హాస్య నటన మధ్య సన్నటి తీగ మీద కళ్ళకు గంతలు కట్టుకుని, చేతిలో చాంతాడంత వాసం పెట్టుకుని అలవోకకగా ఈ మూల నించి ఆ మూలకు నడిచి పోయాడు. అతని ప్రతిభకు అతి ముఖ్య నిదర్శనం మేస్టర్ షోట్ కీ క్లోస్ అప్ షోట్ కీ ఒకే రకమైన ఎక్స్ప్రెషన్ ని నిలపగలగడం. స్వరాన్ని ని ఒక రెజిస్టర్ తగ్గించి (గొంతు నొక్కినట్టుగా) (తనకు తెలిసిన, బయటకు చెప్పుకోలేని) ఇబ్బంది పడుతున్నట్టుగా వాయిస్ మాడ్యులేట్ చేసిన తీరు అద్భుతం.
కమర్షియల్ సినిమాకి ఇన్ని మాటలేంటి అనే లోపు, ఆర్టు బొమ్మ ను చెడ గొట్టటం కష్టం, ఫార్ములా బొమ్మని మెచ్చేట్టుగా తీయడం ఇంకా కష్టం. ముక్కలు ముఖం వైపు తిప్పి చూపే ఆడే ఈ మూడు ముక్కలాటలో, ఆట తిరిగే ముక్కల్లో లేదు, తిప్పే చేతిలో ఉంది!
checkout http://kanchib.blogspot.com for Srinivas's Blog.